calender_icon.png 27 October, 2024 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతించిన గోదావరి!

24-07-2024 12:11:15 AM

విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 23: గోదావరి శాంతించింది. నాలుగు రోజులపాటు రాష్ట్రాన్ని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వణికించిన గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. పరివాహక ప్రాంతాల్లో కురిసిన విస్తారమైన వర్షాల కారణంగా సోమవారం రాత్రి వరకు ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి మూడో హెచ్చరిక స్థాయి సమీపానికి చేరుకొన్నది. మంగళవారం ఉదయం ౧౦ గంటలకు ౫౧.౬౦ అడుగులకు చేరిన గోదావరి ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. రాత్రి 9 గంటలకు 49.90 అడుగులకు చేరుకొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకొన్నది. భద్రాచలం దిగువన శబరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ పోటు వేయడం వల్ల గోదావరి ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది.

బుధవారం నాటికి రెండో ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించే అవకాశం ఉందని అధికారలు చెప్తున్నారు. అయినా భద్రాచలం నియోజకవర్గంలోని పలు రాష్ట్ర, జాతీయ రహదారులను గోదావరి బ్యాక్ వాటర్ ముంచెత్తుతున్నది. భద్రాచలం నుంచి వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలతోపాటు భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే జాతీయ రహదారి సైతం ఇంకా ముంపులోనే ఉంది. ఫలితంగా అటుగా వెళ్లే వేలాది వాహనాలు భద్రాచలంలో పడిగాపులు కాస్తున్నాయి. భధ్రాచలం నుంచి వెళ్లే జాతీయ రహదారిని అధికారులు పట్టణ శివారుల్లో మూసివేయడంతో వందలాది లారీలు, ఇతర వాహనా లు గమ్యస్థానానికి వెళ్లే పరిస్థితి లేదు.

భద్రాచలంలోని కూనవరం రోడ్డులో వాహనాలు పడిగాపులు కాస్తున్నాయి. గుండాల మండలంలోని కొడవటంచ వద్ద గల ఏడుమల కలవాగుపై హైలెవల్ వంతెన లేకపోవడంతో వరదనీరు లోలెవల వంతెనపై నుం చి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో పోలీసులు ఆ వాగుపై నుంచి రాకపోకలు చేయకుండా బారికేడ్స్ ఏర్పాటుచేశారు. దీంతో కొడవటంచ, నాగారం, పాలగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చర్ల మండలంలోని తిప్పాపురం రోడ్డు కొట్టుకు పోవడంతో బత్తినపల్లి హూ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

మేడిగడ్డకు కొనసాగుతున్న వరద 

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్‌కు వరద కొనసాగుతూనే ఉంది. సోమవారం 9 లక్షల పైచిలుకు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, మంగళవారం సాయంత్రం వరకు 7.71 లక్షల క్యూసెక్కులకు తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి వస్తున్న నీటిని అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం అలాగే ఉంది. పుష్కరఘాట్ వద్ద 11.460 మీటర్ల మేర ప్రవాహం కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నల్ల వాగు మత్తడి పొంగిపొర్లుతోంది. నిర్మల్ జిల్లాలో వర్షాలు తగ్గిపోవడంతో అధికారులు కడెం ప్రాజెక్టు మూడు గేట్లను మూసివేశారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 691.30 అడుగులు నిల్వ ఉంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భీమరాజు గుట్ట వాగు ఉద్ధృతంగా ప్రవాహించి చిన్న గుర్జాల్  లోంక తండా వంతెన కోతకు గురైంది. 

కృష్ణా ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు

కృష్ణా నదికి సైతం ఎగువ నుంచి వరద వస్తుండటంతో ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి సుమారు 1,80,000 క్యూసెక్కుల వరదను నారాయణపూర్ వైపు వదిలారు. నారాయణపూర్‌లో సైతం వచ్చిన వరదను వచ్చినట్టే జూరాలకు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో నదీతీరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రచారం చేస్తున్నారు. జూరాలలో 36 గేట్లు తెరిచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి నీటి మట్టానికి చేరువ కావడంతో దిగువనకు నీటిని విడుదల చేసేందుకు ప్రాజెక్టు అధికారులు సిద్ధమయ్యారు. వరద ఉద్ధృతి ఇదే స్థాయిలో కొనసాగితే పక్షం రోజుల్లో శ్రీశైలం పూర్తి స్థాయి జలకళను సంతరించుకుంటుంది.  

ఆరు రోజులుగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి 

వర్షాల కారణంగా సింగరేణి సంస్థకు బొగ్గు ఉత్పత్తికి భారీగా గండి పడింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని 17 ఉపరితల బొగ్గుబావుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల కారంణంగా సుమారు 1.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి, సింగరేణికి భారీగా నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. 

పెన్‌గంగలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం 

ఆదిలాబాద్ జిల్లా పెన్ గంగలో గల్లంతైన యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమయింది. ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద (టి) గ్రామానికి చెందిన శివ మిత్రులతో కలిసి ఆదివారం పెన్‌గంగ నదికి స్నానానికి వెళ్లారు. వరద ఉద్ధృతి పెరగడంతో శివ నీటిలో గల్లంతైయ్యడు. యువకుడి కోసం డీడీఆర్‌ఎఫ్ బృందం రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టింది. మంగళవారం డోలారా సమీపం లోని పెన్ గంగ నది తీరాన యువకుడి మృతదేహం తేలింది. పోలీసులు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. 

మరో రెండు రోజులు వాన

అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో రెండు రోజులు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదుల్లో ప్రవాహాలు కొనసాగుతుండగా, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగులు ఉప్పొం గి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మంగళవా రం నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కాగా, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడిందన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల వద్ద పోలీసుల పహారా

వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. వాగులు, ఒర్రెలు ఉప్పంగడంతో ఎస్పీ డీవి శ్రీనివాస్ అప్రమత్తం అయ్యి ప్రజలు వాగు లు, వంకలు దాటకుండా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు.ప్రజలు ఎవ్వరు కూడా వరుద తగ్గే వరకు వాగులు దాటవద్దని అధికారులు కోరుతున్నారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి,ఎస్పీ డీవి శ్రీనివాస్ పలు ప్రాంతాల్లోని వాగులను,ఒర్రెలను పరిశీలించారు. జగిత్యాల జిల్లాలోని మోతె, అనంతారం, కండ్లపల్లి చెరువులను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.

చెరువులకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య గల ప్రాణహిత నదిని రామగుండం సీపీ శ్రీనివాసులు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ సందర్శించారు. సిరోంచా బ్రిడ్జి వద్ద, అర్జునగుట్ట ఫెర్రి పాయింట్ వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత నది వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని పరసాడ (కే), ధర్మగూడ, ఆర్జుని గ్రామ పంచాయితీ పరిధిలోని మారుగూడ, ఝరి, గాదిగూడ, డాబా (కే) గ్రామాలను కలెక్టర్ రాజరిషా సందరించారు.