18-02-2025 12:00:00 AM
మూడేళ్లుగా సాగుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు జోరందుకున్నాయి. తాను అధికారంలోకి వస్తే ఈ మారణ కాండకు అంతం పలుకుతానని, అమాయక ప్రజల హననాన్ని ఆపుతానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు. అసలు తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే యు ద్ధమే వచ్చేది కాదని కూడా ఆయన ప్రకటించడం గమనార్హం.
అన్నట్లుగానే అధికారంలోకి వచ్చీ రాగానే ఈ దిశగా చర్యలు మొదలు పెట్టారు. అటు రష్యా ప్రధాని పుతిన్‌తో పాటుగా ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ ఫోన్‌లో సంభాషించిన ఆయన ఇరువురు నేతలను ఈ దిశగా ఒప్పించారు.త్వరలోనే సౌదీ అరేబియా వేదికగా తాను పుతిన్‌తో భేటీ అవుతానని కూడా ఆ సమయంలోనే ప్రకటించారు.
అందుకు సన్నాహకంగా ఇరుదేశాల ప్రతినిధులు మంగళవారం సౌదీలో సమావేశం కాను న్నారు. ఈ సమావేశంలో అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్‌వాల్జ్ తదితరులు పాల్గొననుండగా, రష్యా తరఫున విదేశాంగ మంత్రి లవ్రోవ్ తదితరులు పాల్గొం టారు.
అయితే శాంతి చర్చల్లో ఉక్రెయిన్ పాల్గొంటుందా లేదా అనే విషయంలో మొదట్లో సందేహాలు వ్యక్తమయినా తప్పకుండా పాల్గొంటుం దని స్వయంగా ప్రకటించడంతో దీనిపై స్పష్టత వచ్చింది. మంగళవారం జరగబోయే చర్చలు సన్నాహకం మాత్రమేనని, అసలు చర్చలకు ఇంకా చాలా సమయం ఉందని సౌదీ బయలుదేరే ముందు అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ప్రకటించడం గమనార్హం.
కాగా అమెరికా రష్యా చర్చలకు దూరంగా జరిగిన బ్రిటన్ మాత్రం చర్చలపై భిన్నమైన ప్రకటన చేసిం ది. ఇది కేవలం ఉక్రెయిన్ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నమాత్రమే కాద ని ఐరోపా ఉనికికీ కీలకమైనదని ఆ దేశ ప్రధాని స్టార్మర్ అన్నారు. సుదీర్ఘ కాలం ఉక్రెయిన్‌లో శాంతి సుస్థిరతను కాపాడడం చాలా ముఖ్యమన్నారు. అవసరమైతే ఉక్రెయిన్‌లో తమ సేనలు బరిలోకి దిగుతాయంటూ ఆయన చేసిన ప్రకటన గమనార్హం.
రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు శాంతిచర్చల దిశ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగడంపై ఐరోపా దేశాలు కలవరపడుతున్నాయి. దీనిపై భవిష్యత్తు ప్రణాళికను చర్చించేందుకు సోమ వారం ప్యారిస్‌లో అత్యవసరంగా సమావేశమయ్యాయి కూడా. అయితే యుద్ధం ముగియడం అటు రష్యాతో పాటుగా ఇటు ఉక్రెయిన్‌కూ ముఖ్య మే. యుద్ధంలో రెండుదేశాలు ఘోరంగా నష్టపోయాయి.
ఒకప్పుడు అగ్రరాజ్యంగా చెలామణి అయిన రష్యా ఇప్పుడు దాదాపుగా ఒంటరి అయి పోయింది. మరోవైపు ప్రతి రోజూ వెయ్యిమందికి పైగా రష్యా సైనికులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నట్లు చెబుతున్నారు. ఇంకోవైపు దేశ ఆర్థి క పరిస్థితి కూడా బాగా దెబ్బతిన్నది. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే బైడెన్ హయాంలో అమెరికాతో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడం పుతిన్‌కు అవసరం.
మరో వైపు యుద్ధం కారణంగా ఇరువై పులా 7 లక్షల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయినట్లుగా లెక్కలు చెబుతున్నా ఈ సంఖ్య చాలారెట్లు ఎక్కువే ఉంటుందని పరిశీలకుల అంచనా. వీరిలో ఎక్కు మంది ఉక్రెయిన్ పౌరులే. రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో పట్టణాలకు పట్టణాలే నేలమట్టమయిపోయాయి. ఈ నేపథ్యం లో దేశ పునర్నిర్మాణానికి బిలియన్ల డాలర్లు అవసరమని ఐరాస చెప్తోం ది.
మొన్నటిదాకా అమెరికాతో పాటుగా ఐరోపా దేశాలు అందించే భారీ సహాయంతో జెలెన్‌స్కీ యుద్ధం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ రాకతో అమెరికానుంచి సాయం అందడం అనుమానంగా మారిం ది. అయితే యుద్ధం ముగియడం అంత సులువు కాదని పరిశీలకుల అంచనా.
ఉక్రెయిన్‌కు శాశ్వత భద్రత అంశంపై స్పష్టమైన హామీ, రష్యా స్వాధీ నం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాల భవిష్యత్తులాంటి పలు చిక్కు ముళ్లున్నాయి. వీటికి పరిష్కారాలు ఎలా కనుగొంటారో చూడాలి. అయితే శాం తి చర్చల దిశగా అడుగు ముందుకు పడడం మాత్రం ముదావహం.