calender_icon.png 18 October, 2024 | 5:28 PM

విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ

18-10-2024 03:25:36 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు బెల్లంపల్లి తిలక్ స్టేడియం నుండి కాంటా చౌరస్తా వరకు శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మూడేళ్లుగా ప్రభుత్వం ఏడు వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజులు, ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. రోజురోజుకు కళాశాలలో మూసివేతకు గురవుతున్నాయని ఆరోపించారు.

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వము అడుగులు వేస్తుందన్నారు. కళాశాలలు నడపలేక, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక, కళాశాలల యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని ఆరోపించారు. టోకెన్ అమౌంట్ కాకుండా పూర్తి బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనట్లయితే ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో ఏఐఎఫ్డివై జిల్లా కార్యదర్శి వసులేటి వెంకటేష్, ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్, ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, ఏఐఎస్ఎ రాష్ట్ర అధ్యక్షులు అన్ని సాగర్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దీపక్ కుమార్, ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్ తో పాటు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.