27-04-2025 06:47:24 PM
నక్సల్స్ తో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉంది
మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో శాంతి చర్చల కమిటీ నేతలు ఆదివారం భేటీ అయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంను నేతలు కోరారు. శాంతిచర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ సీఎంకు వినతిపత్రమిచ్చారు.
నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంతోనే చూస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నక్సలిజాన్ని శాంతిభద్రతల అంశంగా పరిగణించదన్నారు. నక్సల్స్ తో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డి(Kunduru Jana Reddy)కి ఉందన్న రేవంత్ రెడ్డి ఈ అంశంపై జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామని వెల్లడించారు. మంత్రులతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.