calender_icon.png 11 January, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక ప్రశాంతత మన చేతుల్లోనే!

18-10-2024 12:00:00 AM

హైటెక్ యుగంలో మానవ జీవితం పరుగుల మయమై పోటీ నెలకొంటున్నది. ఉదయం మేల్కొనప్పట్నించీ రాత్రి పడుకునే దాకా ఎన్నో ఒడుదొడు కులు ఎదుర్కోక తప్పడం లేదు. మారుతున్న కాలానికి  అనుగుణంగా అన్ని విషయాలలో వేగం పెరిగింది. అన్ని రంగాలలో సంపూర్ణ పోలిక, పోటీతత్వాలు పెరిగిపోయాయి. భౌతిక సంపదపై మోజు అధికమైంది. నైతికతక విలువలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి.

ఫలితంగా మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువవుతున్నది. సుమారు 70 శాతం ఆరోగ్య సమస్యలు కేవలం ఒత్తిళ్లవల్ల వస్తు న్నాయని పలు ఆరోగ్య సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇవి అన్ని వయసుల వారికి సర్వసాధారణమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తు అగమ్యగోచరం కావచ్చునని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆందోళన బీపీ నుంచి మధుమేహం వరకు అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. 

జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే కాలంతోపాటు పరుగెత్తాల్సిందే. పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి ప్రతిభ, సామర్థ్యాలను పెంచుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితులను తట్టుకోవడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. చాలినంత నిద్ర తప్పక ఉండాలి. కనీసం రోజుకు 7 గంటలు నిద్ర పోవాలి. నియమబద్ధమైన మంచి ఆహార అలవాట్లు అలవర్చుకోవాలి. చిరునవ్వు భూషణం అయితే, దూషణలు దూరమై ఆనందం దరిచేరుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటానికే ప్రయత్నించాలి. 

పోషకాహారం, వ్యాయామం తప్పనిసరి

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం తప్పక చేయాలి. కనీసం రోజు ఉదయం 30 నిమిషాలైనా నడవాలి. యోగ, ప్రాణాయామం, శ్వాసమీద ధ్యాస నిలిపి, ధ్యానం చేస్తుండాలి. దీనివల్ల మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, బి2, బి12 విటమిన్లు, మినరల్స్‌తోకూడిన పోషకాహారం తీసుకోవాలి. పాలలో ఉండే పదార్థం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.

ఇందులోని బయోయాక్టివ్ గుణం వల్ల ఒత్తిడినుంచి ఉపశమనం కలుగుతుంది. ఏదైనా ఒక పని చేసే ముందు ‘ఎలా చెయ్యాలి?’ అన్నది ప్లాన్ వేసుకోవాలి  ఎప్పుడు చేయాలి? ఎంత సమయం కేటాయించాలి? ఫలితంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి?’ వంటి విషయాలతో ఒక ప్రణాళిక వేసుకోవాలి. మీరు పనిచేసే చోట అవాంఛనీయ ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి.

ప్రణాళిక ప్రకారం వెళితే సమస్యల పరిష్కారాలకు అవకాశాలు ఎక్కువగా వుంటాయి. తీసుకునే మంచి ఆహారం కూడా ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కూరగాయలు, పప్పు దినుసులు, చేపలు, మాంసం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉన్న ఆహారం తిన్నవారికి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఒత్తిడి తగ్గాలంటే ప్రతి పాజిటివ్ దృక్పథం, ఉత్తమ ఆలోచనా విధానం, సమాజసేవ దృక్పథం, సమర్పిత భావన, సహనం, సమన్వయం, సహకారం వంటి సానుకూల దృక్పథాలను కలిగివుండాలి.

 నేదునూరి కనకయ్య