16-03-2025 12:24:49 AM
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): మనసును అదుపులో పెట్టుకున్నప్పుడే లక్ష్యాలను అధిగమించి, ఉన్నత స్థితికి చేరుకోగలమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. మనస్సు నియంత్రణతోనే మనశ్శాంతి సిద్ధిస్తుందని, ఇందుకు సాధనే ప్రధాన అస్త్రమన్నారు. ఈ మార్గంలో ప్రజలను నడిపించేందుకు బ్రహ్మ కుమారీస్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
హైదరాబాద్‌లోని బ్రహ్మ కుమారీస్ శాంతి సరోవర్‌లో జరిగిన ‘మానసిక నియంత్రణతో న్యాయ, వ్యక్తిగత విజయాల పెంపు’ అనే చర్చాకార్యక్రమం ముగింపు సమావేశానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఆత్మను వికసింపజేస్తేనే ధర్మం వైపునకు అడుగులు వేయగలమని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. ధర్మరాజ్యం అంటే చట్టాన్ని అమలు చేయడమేనన్నారు. ఏ చట్టమూ ధర్మానికి అతీతం కాదన్నారు. అంతకుముందు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టి మాట్లాడుతూ.. న్యాయవాదులు సానుకూల ధ్రుక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి టీ అమర్‌నాథ్ గౌడ్, టీజీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. ఈశ్వరయ్యతోపాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.