calender_icon.png 18 January, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజాలో శాంతిరేఖలు!

17-01-2025 12:00:00 AM

యావత్ ప్రపంచం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పు ల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహా ఇందుకు వేదిక అయింది. గత 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్ హమాస్‌లు బుధవారం ఒక ఒప్పందానికి వచ్చినట్లు ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన  ముగ్గురు అమెరికా అధికారులతో పాటుగా హమాస్ ప్రతినిధి కూడా వెల్లడించారు.

దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఓ ప్రకటన చేశారు. తన కెరీర్‌లో అత్యంత కఠినమైన డీల్ ఇదేనని ఆయన ప్రకటించారు. అయితే నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడిగా తన విజయంతోనే ఈ ఒప్పందం సాధ్యమయిందని మరో మూడు రోజుల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ చెప్పుకోవడం గమనార్హం. తన ప్రమాణ స్వీకారం సమయానికి బందీలను విడుదల చేయకపోతే హమాస్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ కొద్ది రోజుల క్రితం ప్రకటించడం తెలిసిందే.

అది అలా ఉంచితే ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ప్రకటించడంతో ఆదివారంనుంచి అమలు కావలసిన ఈ ఒప్పందం కార్యరూపం దాల్చుతుందా అనే ఉత్కంఠ కూడా నెలకొంది. తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్ ఆమో దం తెలపాల్సి ఉండగా, తుది ప్రకటన వెలువడే దాకా దాన్ని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు హమాస్ ప్రకటించడంతో గాజాలో తుపాకుల చప్పుళ్లకు ముగింపు లభించనుందన్న ఆశలు బలమయ్యాయి. తాజా ఒప్పందం ప్రకారం గాజాలో 42 రోజుల పాటు కాల్పుల విరమణ అమలులో ఉంటుంది. ఒప్పందం తొలి దశలో గాజా ప్రాంతంనుంచి ఇజ్రాయెల్ సైన్యాలు వెనక్కి వెళ్తాయి. అదే సమయంలో హమాస్ చెరలో బందీ లుగా ఉన్న వందమంది ఇజ్రాయెలీల్లో 33 మందిని హమాస్ వదిలిపెడుతుంది.

దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ తన జైళ్లలో మగ్గుతున్న వందలాది పాలస్తీని యన్లను వదిలిపెడుతుంది. తదుపరి దశలో ఇప్పటికే దాదాపు మరుభూమిగా మారిన గాజాలో నిరాశ్రయులైన వేలాదిమంది తిరిగి కోలుకోవడానికి పెద్దఎత్తున మానవతా సహాయం అందించడం మొదలవుతుంది. కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి ఇజ్రాయెల్, హమాస్‌లు మళ్లీ చర్చలు జరపనున్నాయి.

ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదరడం పై భారత్‌తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వతం కావాలని, గాజా ప్రజల కడగండ్లకు ముగింపు పలకాలని కోరుకొంటున్నట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న వార్త తెలియగానే గాజా ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడి జరపడంతో మొదలైన ఈ యుద్ధంతో ఇరుపక్షాలకు చెందిన 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క గాజాలోనే 46 వేలమంది పౌరులు మృత్యువాత పడగా లక్షమందికి పైగా గాయపడ్డారు. నగరంలో ఎక్కడ చూసినా భవన శిధిలాలే కనిపిస్తున్నాయి. చిన్నారులు సహా వేలాదిమంది ఆకలితో అలమటిస్తున్నారు. వీరందరికీ ఈ కాల్పుల విరమణ ఓ వరం కానుంది.

ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు హమాస్ కీలక నేతలు ప్రాణాలు కోల్పోవడంతో అది బలహీనపడింది. అమెరికాతో పాటుగా ఈజిప్టు, ఖతార్ లాంటి దేశాలు అనేక రోజులుగా సుదీర్ఘ చర్చలు జరపడం ద్వారా ఇరుపక్షాలపై తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఈ కాల్పు ల విరమణ సాధ్యమయింది. అయితే కాల్పుల విరమణను అవి చిత్తశుద్ధితో అమలు చేస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదం తెలపడంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.