calender_icon.png 12 February, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉక్రెయిన్‌లోనూ శాంతి!

25-01-2025 12:00:00 AM

గత కొంతకాలంగా యుద్ధ మేఘాలు అలముకున్న ప్రపంచంలో మళ్లీ శాంతి పవనాలు వీచనున్నాయా?  కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు అవుననే సంకేతాలను ఇస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ గద్దె దిగడానికి కొద్ది రోజుల ముందు గాజా ప్రాంతంలో మారణకాండకు తాత్కాలికంగా తెరపడగా, ఇప్పుడు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వెయ్యిరోజులకు పైగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కూడా ముగింపు పలకాలన్న కృతనిశ్చయంతో  ఉన్నట్లు కనిపిస్తోంది.

అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి ముందే ట్రంప్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా ఈ విషయంపై మాట్లాడినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. త్వరలోనే పుతిన్‌తో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పిన ట్రంప్ తాజాగా రెండు రోజుల క్రితం వైట్‌హౌస్‌లో విలేఖరులతో మాట్లాడుతూ కూడా ఇదే విషయంపై మరోసారి స్పష్టత ఇచ్చారు. ఒక వేళ పుతిన్ గనుక ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందంపై చర్చలకు రాకపోతే రష్యాపై ఆంక్షలు తప్పవని కూడా హెచ్చరించారు.

తానుగనుక అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్‌లో సంక్షోభమే వచ్చి ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. పుతిన్‌తో తనకు బలమైన అవగాహన ఉందన్న ట్రంప్.. జెలెన్‌స్కీ కూడా శాంతి ఒప్పందం జరగాలని కోరుకుంటున్నారని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ కూడా సానుకూలంగా స్పందించింది.  చర్చలకు పుతిన్ కూడా సిద్ధంగా ఉన్నారని,  వాషింగ్టన్‌నుంచి దీనికి సంబంధించిన సంకేతాలకోసం ఎదురు చూస్తున్నామని రష్యా అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి.

దిమిత్రీ  పెస్కోవ్  స్పష్టం చేశారు. దీంతో రెండు అగ్రరాజ్యాల అధినేత భేటీకి లైన్‌క్లియర్ అయినట్లేనని చెప్పాలి. ముహూర్తమే తరువాయి. గత కొంతకాలంగా రష్యాఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి సానుకూల సంకేతాలు  వినిపిస్తూ వస్తున్నప్పటికీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, కొత్త ప్రభుత్వం కొలువుదీరడం కారణంగా ఈ విషయంపై అడుగు ముందుకు పడలేదు. మరోవైపు బైడెన్ పట్ల పుతిన్‌కు అంతగా సదభిప్రాయం లేకపోవడంతో భారత్, చైనాలు చొరవ తీసుకుంటే బాగుంటుందన్న సంకేతాలు కూడా ఇచ్చారు. 

వాస్తవానికి ఈ రెండు యుద్ధాల కారణంగా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.15నెలల ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో గాజా ప్రాంతం మరుభూమిగా మారింది. 46 వేలకు పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా వారిలో 18 వేల మంది చిన్నారులున్నారు. ప్రాణనష్టం ఇంకా ఎక్కువే ఉంటుందని పలు అంచనాలు చెబుతున్నాయి. 2022లో రష్యా దళాలు ఉక్రెయిన్ నగరాలపై దాడులకు దిగడంతో ఇరు దేశాల మధ్య పోరు మొదలైంది.

రెండో ప్రపంచయుద్ధం తర్వాత యూరప్‌లోనే అత్యంత భీకరమైన ఈ యుద్ధంలో 80 వేలకు పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారు. 4 లక్షలకు పైగా గాయపడ్డారు. రష్యా వైపు కూడా భారీగానే ప్రాణనష్టం జరిగింది. మరోవైపు రష్యా దాడుల్లో ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం తగ్గిపోయినట్లు అంచనా. దాదాపు 40 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. ఇక నగరాలు, పట్టణాల్లో జరిగిన విధ్వంసానికి అంతేలేదు. దేశ పునర్నిర్మాణం జరగాలంటే మిలియన్ల డాలర్లు అవసరమని  అంచనా.

అన్నిటికన్నా మించి ఉక్రెయిన్ భూభాగంలో ఐదోవంతును రష్యా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈ భూభాగాన్ని రష్యా తిరిగి ఉక్రెయిన్‌కు అప్పగిస్తుందా, లేక ఆక్రమిత భూభాగంలో కొంత వదులుకోవడానికి జెలెన్‌స్కీ సిద్ధమవుతారా? అనేది ప్రశ్న. అయితే చర్చలంటూ మొదలయితే మిగతా సమస్యలకు పరిష్కారం కనుగొనడం సమస్య కాదు.

ఎందుకంటే ఈ యుద్ధం ఇరుదేశాల్లోనే కాకుండా ప్రపంచ సంక్షోభానికి కూడా దారి తీసింది. అందుకే ట్రంప్ సహా అన్ని వర్గాలు చర్చలకు సిద్ధమవుతున్నాయి. ఈ విషయంలో పుతిన్‌ను ఒప్పించడానికి భారత్, చైనాలు కూడా తమ వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నందున అతి త్వరలోనే తీపి కబురు వినిపిస్తుందని ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి.