calender_icon.png 22 October, 2024 | 5:16 AM

పోలీసుల త్యాగాలతోనే సమాజంలో శాంతి

22-10-2024 12:28:06 AM

  1. అమరుల కుటుంబాలకు ఆదుకుంటాం: మెదక్ కలెక్టర్‌రాహుల్ రాజ్ 
  2. పోలీసుల సేవలను గుర్తుంచుకోవాలి: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్

మెదక్/ వికారాబాద్, అక్టోబర్ 21(విజయక్రాంతి): పోలీసు అమరవీరుల త్యాగంతోనే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొన్నాయని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ప్రజల రక్షణ గురించి అహర్నిశలు కృషి చేస్తోన్న పోలీసులు, అమరులైన పోలీసు కుటంబాలకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్న పోలీసుల పాత్ర సమాజానికి ఎంతో ముఖ్యమని కొనియాడారు.

అమరులైన పోలీసులు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని, శాంతి భద్రతలు సరిగా ఉన్నప్పుడే మారుమూల గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. అమరులైన పోలీసుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవకు అంకితం కావాలని మెదక్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 

వారి త్యాగాలను మరువలేం..

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి సేవలను గుర్తుంచుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ కార్యాలయం పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు అమరవీరుల స్థూపానికి ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనందరం పండుగలు, వేడుకలు ఆనందంగా చేసుకుంటుంటే పోలీసులు మాత్రం మన భద్రత కోసం అకింతభావంతో పనిచేస్తుంటారని తెలిపారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్న ప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారన్నారు.

ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ చైనా దురాక్రమాన్ని అడ్డుకునే క్రమంలో 21 మంది పంజాబ్ పంజాబ్ పోలీసులు అమరులయ్యారని, వారి త్యాగాలకు గుర్తుగా పోలీస్ సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి, అదనపు కలెక్టర్లు సుధీర్, లింగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.