calender_icon.png 24 October, 2024 | 5:52 AM

శాంతి, సుస్థిరతకే ప్రాధాన్యం

24-10-2024 03:43:15 AM

సరిహద్దు ఒప్పందం హర్షనీయం

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీలో మోదీ

చర్చలు, దౌత్యానికే 

భారత్ మద్దతిస్తుంది

బ్రిక్స్ సదస్సులో ప్రధాని

మాస్కో, అక్టోబర్ 23: రష్యాలో జరుగుతోన్న 16వ బ్రిక్స్ సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తిన తర్వాత తొలిసారి భేటీ అయి ఇద్దరు నేతలు ఇటీవల జరిగిన సరిహద్దు ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సరిహద్దులో శాంతి రెండు దేశాల ప్రాధాన్యంగా ఉండాలి. ఐదేళ్ల తర్వాత అధికారికంగా కలిశాం. భారత్, చైనా సంబంధాలు రెండు దేశాలకే కాకుండా ప్రపంచ శాంతి, సుస్థిరత, పురోగతికి ఎంతో కీలకం. నాలుగేళ్లుగా నెలకొన్న ఘర్షణపై రెండు దేశాల మధ్య వచ్చిన ఏకాభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాం. రెండు దేశాల సంబంధాలకు విశ్వాసం, గౌరవం సున్నితత్వం ప్రాతిపదికగా ఉండాలి అని మోదీ పేర్కొన్నాడు. మోదీతో భేటీ అనంతరం  జిన్‌పింగ్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సమాచార మార్పిడి, సహకారం పెరిగితే విభేదాలు తొలగిపోతాయని అన్నారు. అంతర్జాతీయ బాధ్యతను భుజానికెత్తుకోవడం, బలాన్ని పెంపొందించుకునేందుకు ఉదాహరణగా నిలవాలని సూచించారు. 

యుద్ధానికి మద్దతివ్వం

రష్యాలోని కజన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఘర్షణ వాతావరణంపై మాట్లాడారు. యుద్ధంతో కాకుండా చర్చలు, దౌత్యానికే భారత్ మద్దతిస్తుందని ఉద్ఘాటించారు. రష్యా యుద్ధంతో పాటు మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు, వాతావరణ మార్పులపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి, హింసకు నిధులిచ్చేవారికి వ్యతిరేకంగా ప్రపంచం సంకల్పం తీసుకోవాలని, అన్ని దేశాలు ఈ అంశంపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు కొత్త అవకాశాలు సృష్టించాలని సూచించారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేసే అంశంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదని కొన్ని దేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సైబర్ సెక్యురిటీ, సురక్షిత ఏఐ కోసం అంతర్జాతీయ నియమాలను తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని చెప్పారు. ప్రపంచ గమనాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లే సత్తా బ్రిక్స్ దేశాలకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. 

సంస్కరణల అవసరం

బ్రిక్స్‌లో భాగస్వాములుగా ఉండేందుకు ఇతర దేశాలను ఆహ్వానించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. అయితే ఈ అంశంలో వ్యవస్థాపక దేశాల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని చెప్పారు. విభిన్న ఆలోచనలు, భావజాలం ఉన్న దేశాలతో ఏర్పడిన బ్రిక్స్ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు కలిసి బ్రిక్స్ కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిని విస్తరిస్తూ తాజాగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలకు సభ్యత్వం ఇచ్చారు. రష్యాలో రెండు రోజులపాటు పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ బుధవారం రాత్రి భారత్‌కు చేరుకున్నారు.