* హీరో ఇంటిపై రాళ్లదాడి ప్రభుత్వ వైఫల్యమే
* ఏడాదిలోనే హైదరాబాద్‌లో 35944 కేసులు
* మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏడాదిలోనే హైదరాబాద్‌లో 35,944 క్రైమ్ కేసులు నమోదు కావడం ఘోరమైన పరిస్థితికి అద్దం పడుతున్నదని ఆదివారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ రోజు అల్లు అర్జున్ నివాసంపై జరిగిన రాళ్ల దాడి సంఘటన పూర్తిగా పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని, హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అడుగంటుతున్న శాంతి భద్రతల పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతుండటం వల్ల ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో శాంతి భద్రతలు లేవనే విషయం స్పష్టమవుతోందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా శాంతి భద్రతలు పునరుద్ధరించడానికి, ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి నిలబెట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.