సూర్యాపేట, ఫిబ్రవరి 2 : విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 4,5 తేదీలలో భద్రాచలం పట్టణంలో జరిగే పిడిఎస్ యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని సంఘ రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలో ఆదివారం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే అత్యున్నత న్యాయస్థానమే మందలించే స్థితికి మన విద్యా వ్యవస్థ దిగజారింది అన్నారు.
ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. విద్యారంగ పరిరక్షణ కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాల సాధనకై పీడీఎస్ యు రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సూరం విజయ్,రవి, యశ్వంతి, శ్రీజ, పల్లవి, తేజస్విని, గీతిక, రమ్య, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.