బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో బుధవారం రాత్రి ప్యాసింజర్ రైల్లో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.లక్ష విలువచేసే 24 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని కాగజ్ నగర్ ఆర్పిఎఫ్ సీఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. ప్యాసింజర్ రైళ్లో రవీంద్రఖని రైల్వే స్టేషన్ లో పిడిఎస్ బియ్యం బస్తాలు ఎక్కించి మహారాష్ట్రలో అమ్మేందుకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఆర్పిఎఫ్ సీఐ శ్రీనివాస్ గౌడ్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి 70 బియ్యం బస్తాలు పట్టుకున్నారు. బియ్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. గత సంవత్సరం రూ.10 లక్షల విలువ చేసే 280 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించినట్లు సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇకపై ప్రతి రైల్వే స్టేషన్ లో ఆర్పిఎఫ్ బృందాన్ని ఉంచి రైళ్లను తనిఖీ చేస్తామని సీఐ చెప్పారు.