20-04-2025 12:00:00 AM
హర్షితా జోషి.. ఇండోర్‌కు చెందిన ఒక సాధారణ యువతి. టీనేజ్‌లో తనకు ఎదురైన పీసీఓఎస్ కారణంగా మానసిక ఒత్తిడికి గురైంది. చదువుకు దూరమైంది. ఆ ఒత్తిడిని అధిగమించడానికి జిమ్‌లో కూడా చేరింది. కాని ఫలితం శూన్యం. అయితే సమస్య ఉన్నచోటే పరిష్కారం ఉంటుందన్నట్లు.. తనకు వచ్చిన చిన్న ఆలోచనను వ్యాపారంగా మలుచుకుని నెలకు లక్షల్లో ఆర్జిస్తున్నది. ఆమె బిజినెస్ జర్నీ మీ కోసం..
ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే పథ్యం చేయడం మనలో చాలామందికి తెలుసు. ఈ క్రమంలో నచ్చిన పదార్థాలూ పక్కన పెట్టేస్తుంటాం. అయితే ఇలా ఆహారపు కోరికలు చంపుకోవడ కంటే.. వాటినే ఆరోగ్యకరమైన రీతిలో తయారుచేసుకుని తీసుకోవడం మేలనుకుంది. టీనేజ్‌లో పీసీఓఎస్ బారిన పడిన ఆమె.. ఈ క్రమంలో తనకెంతో ఇష్టమైన పెరుగును దూరం పెట్టాల్సి వచ్చింది. అది నచ్చక తానే స్వయంగా ఆరోగ్యకరమైన పెరుగు తయారుచేసుకుని తీసుకోవడం మొదలుపెట్టింది. అలా యోగార్ట్ బ్రాండ్‌నే ప్రారంభించింది.
పీసీఓఎస్ సమస్య..
పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్). ఇది సహజంగా అమ్మాయి శరీరంలో ఆండ్రోజెన్ లేదా టెస్టోస్టిరాన్ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది క్రమంగా పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. పీసీఓఎస్ వల్ల బరువు పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, మొటిమలు, జుట్టు రాలడం, అవాంఛిత రోమాల సమస్య ఎక్కువ్వడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యను చాలామంది అమ్మాయిలు ఎదుర్కొంటున్నారు.
బీటెక్ చదువుతున్నప్పుడు..
పీసీఓఎస్.. మహిళల ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. 2018లో తన టీనేజ్ వయసులో ఈ సమస్య బారిన పడింది. ఆ సమయంలో బీటెక్ చదువుతున్న ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ‘చిన్నప్పట్నుంచి ఇంజినీర్ కావాలని కలలు కనేదాన్ని. ఈ ఆలోచనలతోనే బీటెక్ చేరా.
అయితే అదే సమయంలో నాకు పీసీఓఎస్ ఉందని నిర్ధారణ అయింది. ఈ సమస్య కారణంగా నెలసరి అదుపు తప్పడం, మూడ్ స్వింగ్స్, కోపం, చిరాకు, ఒత్తిడి.. వంటి లక్షణాలు కనిపించేవి. వీటి కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఇటు ఆరోగ్యాన్ని, అటు చదువును బ్యాలన్స్ చేయలేక సతమతమయ్యేదాన్ని.
ఈ ఒత్తిడిని అదుపుచేసుకోవడానికి జిమ్‌లో కూడా చేరాను. కాని ఫలితం లేదు. అదే సమయంలో మరోవైపు యోగా, ధ్యానం చేయడం, సమతులాహారం తీసుకోవడం.. వంటివి అలవాటు చేసుకున్నా.. క్రమంగా నా ఆరోగ్యంలో సానుకూల మార్పు మొదలైంది’. అంటూ చెప్పుకొచ్చింది హర్షిత.
పీసీఓఎస్ ఫ్రెండ్లీ..
అయితే తనకు నచ్చిన ఆహార పదార్థాల్లోనే ఆరోగ్యకరమైన ప్రత్యామ్యాయాల గురించి వెతకడం ప్రారంభించింది. కాని ప్రిజర్వేటివ్స్, చక్కెరలు, కృతిమ రంగులు వాడని ఉత్పత్తి ఒక్కటీ తన కంట పడలేదని చెబుతున్నది. ‘ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే పదార్థాల్లో చాలావరకు కల్తీవే ఉంటున్నాయి. వివిధ రకాల రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ ఉపయోగించి వాటి జీవిత కాలాన్ని పెంచుతున్నారు.
వీటిని తీసుకోవడం వల్ల చాలామంది పీసీఓఎస్, థైరాయిడ్.. వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతున్నారు. నాకూ పీసీఓఎస్ నిర్ధారణ అయ్యాక పెరుగు ప్రత్యామ్నాయాల గురించి మార్కెట్లో చాలానే వెతికాను. ఆఖరికి గ్రీక్ యోగర్ట్ నా కంట పడింది. అది రుచిలోనే కాదు.. పీసీఓఎస్ ఫ్రెండ్లీ అని తెలుసుకున్నాక.. ఏది తినాలనిపించినా దానివైపే మొగ్గుచూపేదాన్ని’ అంటూ తన పీసీఓఎస్ జర్నీ గురించి పంచుకుంది హర్షిత.
బిజినెస్ జర్నీ..
పెరుగు కోసం ప్రతిసారీ మార్కెట్‌పై ఆధారపడటం కంటే ఈ పాలతోనే రుచికరమైన పెరుగును ఎందుకు తయారుచేసుకో కూడదు అనుకుంది. ఈ ప్రశ్నే తనతో యోగర్ట్ బ్రాండ్ ప్రారంభించేలా చేసింది. పీసీఓఎస్ ఉన్నవారు ఏ1 పాల కంటే ఏ2 పాలతో పెరుగు తయారుచేయడం మొదలుపెట్టింది. అలా పీసీఓఎస్‌తో బాధపడే వారందరికీ రుచికరమైన, పోషకభరితమైన పెరుగును అందించాలనుకుని ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2023లో జోగర్ట్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించింది.
వివిధ ఫ్లేవర్లతో..
‘ప్రతి వంద గ్రాముల పెరుగులో 15 గ్రాముల ప్రొటీన్ ఉండేలా చూ స్తాం. ఇలా తయారుచేసిన పెరుగును సుమారు ఐదు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి, ఆపై తీసి వివిధ రకాల ఫ్లేవర్లను కలుపుతాం. తీపి కోసం మాంక్ ఫ్రూట్ వాడతాం. సహజసిద్ధంగా పం డించిన పండ్లు, నాణ్యమైన కొకోవా.. ఇలా ప్రస్తుతం మా వద్ద 11 రకాల పెరుగు ఫ్లేవర్లు లభిస్తున్నాయి’ అని చెబుతున్నది హర్షిత. ప్రస్తుతం ఇండోర్‌లో తన ఆఫ్‌లైన్ స్టోర్ నడుపుతు న్నది.. త్వరలోనే ముంబయిలో మరో స్టోర్ తెరిచి తన వ్యాపారాన్ని విస్తరిం చే ఆలోచన చేస్తున్నట్లు చెబుతుంది.