25 మీ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో మనూకు నాలుగో స్థానం
తృటిలో కాంస్యం కోల్పోయిన భారత షూటర్
ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో ముచ్చటగా మూడో పతకం సాధించాలనుకున్న భారత షూటర్ మనూ బాకర్‌కు నిరాశే ఎదురైంది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో మనూ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో కాంస్యం చేజార్చుకుంది. అయితే 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో రెండు పతకాలు కొల్లగొట్టిన హర్యానా చిన్నది దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. 22 ఏళ్ల వయసులో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి అందరి చేత శెభాష్ అనిపించుకున్న మనూ బాకర్‌కు సలాం. వచ్చే ఒలింపిక్స్ నాటికి మనూ తాను సాధించిన పతకాల రంగును మార్చాలని ఆశిద్దాం.
చటౌరోక్స్: పారిస్ విశ్వక్రీడల్లో షూటింగ్‌లో భారత్‌కు తృటిలో పతకం చేజారింది. శనివారం మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో జరిగిన ఫైనల్లో భారత షూటర్ మనూ బాకర్ 28 పాయింట్లు సాధించి 4వ స్థానంలో నిలిచింది. కొరియాకు చెందిన యాంగ్ జిన్ 37 పాయింట్లతో స్వర్ణం, ప్రాన్స్ షూటర్ కామెలీ రజతం, 31 పాయింట్లతో హంగేరి షూటర్ వెరొనికా కాంస్యం గెలుచుకున్నారు. ఇక క్వాలిఫికేషన్ రౌండ్‌లో అదరగొట్టిన మనూ ఫైనల్లో అదే ప్రదర్శన పునరావృతం చేయలేకపోయింది.
కాంస్యం కోసం గట్టిగానే ప్రయత్నించినప్పటికీ నిరాశే ఎదురైంది. ఫైనల్లో మనూ బాకర్ స్టేజ్ 1ను మనూ బాకర్ కాస్త నెమ్మదిగా ప్రారంభించింది. సిరీస్ 1లో కేవలం రెండు షాట్లను మాత్రమే కొట్టగలిగింది. ఆ తర్వాత నుంచి కాస్త ఫుంజుకున్న మనూ మెరుగైన ప్రదర్శన చేసింది. సిరీస్ 2 నుంచి ఆరు వరకు అత్యుత్తమంగా షూట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. కానీ క్రమంగా ప్రత్యర్థి షూటర్లు నాణ్యమైన ప్రదర్శన కనబరచడంతో మనూకు తీవ్ర పోటీ ఎదురైంది. ఎలిమినేషన్ చివర్లో సిరీస్ 8లో మనూ కేవలం రెండు షాట్లకే పరిమితమై రేసులో వెనుకబడిపోయింది. అదే సమయంలో హంగేరి షూటర్ వెరొనికా మేజర్ 3 షాట్లతో మూడో స్థానంలోకి దూసుకొచ్చింది. దీంతో మనూ బాకర్ నాలుగో స్థానంతో పోటీని ముగించింది.
ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో కాంస్యం నెగ్గిన మనూ బాకర్.. సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో మరో కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు కొల్లగొట్టిన తొలి భారత షూటర్‌గా చరిత్రకెక్కింది. ఒలింపిక్స్‌లో తృటిలో పతకం కోల్పోయిన భారత షూటర్ల జాబితాలో మనూ బాకర్ కూడా చేరింది. గతంలో 2012 లండన్ ఒలింపిక్స్‌లో జాయ్‌దీప్ కర్మాకర్ (50 మీ రైఫిల్ 3), 2016 రియో ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా (10 మీ ఎయిర్ రైఫిల్).. ఈ ఒలింపిక్స్‌లో 10 మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబౌటాలు నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో పతకాలు మిస్సయ్యారు.
* పతకం సాధించనందుకు ఒత్తిడేమి లేదు. కొద్దిలో పతకం కోల్పోయానన్న బాధ మాత్రం ఉంది. ఈసారి ఒలింపిక్స్‌లో నా నుంచి అత్యుత్తమ ప్రదర్శన వచ్చింది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్థానం నిరాశపరిచింది. ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన వెనుక కోచ్ జస్పాల్ సార్‌ది ముఖ్యపాత్ర. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన చలువే. 2028 లాస్ ఏంజిల్స్‌లో పతకం రంగు మారుస్తా
మనూ బాకర్, భారత షూటర్