- హాజరుకానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
- 6 లేదా 7న అఖిలపక్ష సమావేశం
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): జనాభా నిష్పత్తి మేరకు సంపద పంపిణీ జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ నిర్ణయమని, అందుకు దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనపై ఈ నెల 5న బోయినపల్లిలోని కాంగ్రెస్ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ అధ్వర్యంలో మేధావులు, కులసంఘాల నాయకులు, విద్యార్థి సంఘా లతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించబోతున్నామని, ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.
ఏ ఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను కూడా ఆహ్వానించామని, సమయం దొరికితే హాజరవుతానని చెప్పారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కులగణనపై రాహుల్‌గాంధీ అభిప్రాయాలు తెలుసుకుంటారని అన్నారు. కులగణనకు సంబంధించి శనివారం గాంధీభవన్‌లో కనెక్టింగ్ సెంటర్‌ను పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రారంభించారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడు తూ.. ప్రధాని మోదీ ఎప్పుడు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని, ఆయన ప్రశ్నలను సైతం అంగీకరించరని విమర్శించారు. కానీ రాహుల్‌గాంధీ మాత్రం అందు కు భిన్నంగా విమర్శలను కూడా పాజిటివ్‌గా తీసుకుంటారన్నారు.
వాస్తవాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే పీసీసీ కులగణనపై కార్యక్రమం నిర్వహిస్తోందని, అందుకే ఇక్కడికి వచ్చేందుకు రా హుల్ అంగీకరించారని తెలిపారు. కులగణనలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చా రు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభత్వ అభివృ ద్ధి, సంక్షేమ పథకాలపై సలహాలు, సందేహా లు ఉంటే ఈ కనెక్టివిటీ సెంటర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
భవిష్యత్ అవసరాలు, కార్యక్రమాల కోసం కొంతమంది ఎమ్మెల్యే లు, కార్పొరేషన్ చైర్మన్లు వారి సొంత జిల్లా ల్లో కాకుండా ఇతర జిల్లాలోని అసెంబ్లీ ని యోజకవర్గాలకు ఇన్‌చార్జీలుగా పంపించబోతున్నట్లు వెల్లడించారు. సీనియర్లను కో ఆర్డినేటర్లగా నియమిస్తామని తెలిపారు.
కులగణనపై ఈ నెల 6 లేదా 7న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పా రు. కులగణన నిష్పక్షపాతంగా జరగాలన్నదే తమ ప్రభుత్వ ఆలో చన్నారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు.
బీజేపీలో పంచాయతీ..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగుతోందని, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వ తంత్రంగా పనిచేస్తున్నారని మహేష్‌కుమార్ తెలిపారు. సీఎం ఉండగా, కొత్త సీఎం ప్రస్తావన తీసుకురావడం సరికాదన్నారు. బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డికి ఆ పార్టీలో దక్కుతున్న గౌరవం కోసం ఆలోచించాలని హితవు పలికారు.
కిషన్‌రెడ్డికి, ఆయనకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయనే సమాచా రం ఉందన్నారు. మహేశ్వర్‌రెడ్డి తనకు మంచి మిత్రుడేనని, కానీ కాంగ్రెస్‌లోని విషయాలు ఆయనకేమి తెలుసన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు చాలామంది సీనియర్లు ఉన్నారని చెప్పారు. ప్రజలకు ఏలా మేలు చేయాలన్న లక్ష్యమే తమ ముందున్నదని తెలిపారు.
2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది
కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విమర్శలు చేసే ముందు.. మీరిస్తున్న సంక్షేమ పథకాలు, ౨ కోట్ల ఉద్యోగాలు ఏమైనాయని మహేశ్‌కుమార్‌గౌడ్ నిలదీశారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వక పోవడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ఆమ్మేసి ఉన్న ఉద్యోగాలను ఊడగొ డుతున్నారని ఆయన మండిపడ్డారు. పేద లు, రైతుల గురించే మాట్లాడే హక్కు మోదీ కి లేదన్నారు.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే చేసిన మాటలను వక్రీకరించి మాట్లాడుతున్నారని, ఆర్థిక పరిస్థితిని చూసుకుని హామీలు ఇవ్వాలని ఖర్గే చెప్పారని మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. మూసీకి రూ. లక్ష కోట్లు ఖర్చు అంటూ ప్రతిపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. డీపీఆరే సిద్ధం కానప్పుడు రూ. లక్ష కోట్లని ఎలా చెబుతారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు.