calender_icon.png 26 October, 2024 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తినకు వెళ్లిన పీసీసీ చీఫ్ మహేశ్

26-10-2024 01:20:15 AM

  1. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్‌తో భేటీ 
  2. పీసీసీ చీఫ్‌గా 50 రోజుల ప్రోగ్రెస్‌పై వివరణ
  3. నేడు ఏఐసీసీ చీఫ్‌తో పాటు మరికొందరితో భేటీ

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ హస్తినకు వెళ్లారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జునఖర్గేతో పాటు మరికొందరిని కలిసి రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పీసీసీ నూతన కార్యవర్గ కూర్పు, పార్టీ బలోపేతానికి తీసుకునే చర్యలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

శుక్రవారం ఢిల్లీకి వెళ్లగానే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌తో మహేశ్ సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షులుగా 50 రోజుల పాటు తాను చేపట్టిన కార్యక్రమాలు, రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీ వేణుగోపాల్‌కు వివరించారు.

ప్రతిపక్షాలు అడ్డగోలుగా చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తీరును కూడా తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చిన అంశం, నాయకుల మధ్య సమన్వయానికి తీసుకుంటున్న చర్యలను మహేశ్ వివరించారు.

కులగణన, మూసీ ప్రక్షాళన, అక్రమణకు గురైన చెరువులు, నాళాలు, కుంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలను పార్టీ సమర్థవంతంగా తిప్పికొడుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌పైనా అధిష్ఠానం పీసీసీ చీఫ్‌ను నివేదిక కోరినట్లు సమాచారం. ఇరువురి మధ్య మంత్రి వర్గవిస్తరణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలిసింది.

ఉమ్మడి జిల్లాల వారీగా సమతౌల్యతను పాటిస్తూనే.. సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మహేశ్‌కుమార్‌గౌడ్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. స్థానికసంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు పీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీలు, మండల, గ్రామ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు.