తెలంగాణ చరిత్రలో నిన్న ఒక కొత్త ఆధ్యాయం
కాంగ్రెస్ లో ఎంతటివారైనా పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాలి
హైదరాబాద్: తెలంగాణ చరిత్రలో నిన్న ఒక కొత్త ఆధ్యాయం మొదలైందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(PCC President Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు గాంధీభవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. కులగణన సర్వే శాస్త్రీయంగా, చాలా పకడ్బందీగా జరిగిందని మహేశ్ కుమార్ వెల్లడించారు. ఒక యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కులగణన సర్వేపై విపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని మహేశ్ కుమార్ సూచించారు.
రాహుల్ గాంధీ ఆదేశం మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే చాలా కచ్చితత్వంతో చేశారని చెప్పారు. విమర్శించేవారి దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను తగ్గించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన వెల్లడించారు. ఇలాంటి సర్వే కోసం బీసీ సంఘాలు(BC Communities ) చాలా ఏళ్లు ఎదురుచూశారని పీసీసీ అధ్యక్షుడు తెలిపారు. గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాలని వివరించారు. భవిష్యత్తులో జరిగే జనాభా గణనలోనూ కులగణన అంశాన్ని చేర్చాలన్నారు. కేంద్రం చేసే జనగణనలో కులగణన కూడా చేస్తామని బీజేపీ(Bharatiya Janata Party) చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 3.66 శాతం మంది మాత్రమే సర్వేలో పాల్గొనలేదని ఆయన పేర్కొన్నారు.
వివనాలే ఇవ్వనివారు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రమూ చేయని ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేసింది.. చేసిన వారిని అభినందించాల్సిందిపోయి.. దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఎంతటివారైనా పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాలన్నారు. పార్టీ నియమాలను పాటించని వారిపై చర్యలు ఉంటాయని టీపీసీసీ చీఫ్ వార్నింగ్(TPCC chief warning) ఇచ్చారు. పీసీసీ కమిటీలో 50-60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మెజార్టీలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయంగా న్యాయం జరగటం లేదన్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టన స్థాయి వరకు పార్టీ నిర్మాణం జరుగుతోందని, కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు ఇచ్చుకునే పార్టీ కాదు తమది కాదన్నారు. పార్టీ కోసం కష్టపడిన అన్ని వర్గాల వారికి పదవులు దక్కుతాయని పీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు.