calender_icon.png 16 January, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ చీఫ్.. ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు!

05-09-2024 01:22:46 AM

  1. కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం 
  2. త్వరలో పేర్లు ప్రకటించే అవకాశం?
  3. సామాజిక న్యాయం పాటించాలని నిర్ణయం 
  4. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళకు చోటు
  5. ప్రచార కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి పేరు దాదాపు ఖరారు 
  6. మహిళా విభాగం అధ్యక్షురాలిగా సరితా యాదవ్?

హైదరాబాద్,సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతన అధ్యక్షుడితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను కూడా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఒకేసారి పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను భర్తీ చేసి.. ఆ తర్వాత పూర్తి కార్యవర్గం నియమించే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెం ట్స్‌గా ఐదుగురిని నియమించాలని, అందు లో సామాజిక న్యాయం పాటించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతోపాటు మహిళకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కేటాయించనున్నట్టు చెప్తున్నారు.

ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్‌రెడ్డి ఉండగా, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మహేశ్‌కుమార్‌గౌడ్, జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాద వ్, అజారుద్దీన్, గీతారెడ్డి ఉన్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలను మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ అనుబంధ సంఘాలను ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్స్ చూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేసిన అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంటున్నారు.

పీసీసీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన వెంటనే పాత కార్యవర్గం పూర్తిగా రద్దవుతుంది. దీంతో  పీసీసీ చీఫ్‌ను ఒకసారి, వర్కిం గ్ ప్రెసిడెంట్స్‌ను వేర్వేరుగా ప్రకటించడం కం టే రెండింటిని ఒకేసారి ప్రకటించాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్టు పార్టీ వర్గాలు చె ప్తున్నాయి. పీసీసీకి నూతన అధ్యక్షుడి రేసులో మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్ ఉం డగా, మహేష్‌కుమార్‌గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాల సమాచారం. 

వర్కింగ్ ప్రెసిడెంట్స్ కోసం సీనియర్ల లాబీయింగ్ 

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఢిల్లీ పెద్దల వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నట్టు తెలిసింది. అందులో ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్స్ కోసం ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మైనార్టీ నుంచి ఫిరోజ్‌ఖాన్, ఓసీల నుంచి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డితోపాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్స్‌లో అంజన్‌కుమార్ యాదవ్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎస్టీ సామాజిక వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరామ్ నాయక్‌ను నియమిస్తారనే టాక్ నడుస్తోంది. అయితే, బలరామ్ నాయక్ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఇక మహిళా కోటాలో ప్రస్తుతం పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్న సునీతారావును వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఇక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా గద్వాల మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య యాదవ్‌కు దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు.