calender_icon.png 25 October, 2024 | 11:58 AM

నేడో రేపో పీసీసీ చీఫ్ ప్రకటన

28-08-2024 12:36:59 AM

  1. అధికారికంగా ప్రకటించనున్న ఏఐసీసీ 
  2. కేరళ పర్యటనలో కేసీ వేణుగోపాల్ 
  3. ఢిల్లీకి తిరిగొచ్చాక ప్రకటించే అవకాశం  
  4. తనకే పదవి వస్తుందని మహేశ్‌గౌడ్ ధీమా 
  5. పెద్దలను కలిసేందుకు ఢిల్లీలోనే మధుయాష్కీ మకాం 

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి) : రాష్ట్ర కాంగ్రెస్‌కు నూతన రథసారధి ఎంపిక పూర్తయ్యిందని, నేడో.. రేపో నూతన సారథి పేరును అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. సోమవారంతో అష్టమి పూర్తి కావడంతో ఏ క్షణంలోనైనా కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ కేరళ పర్యటనలో ఉన్నారని, ఆయన ఢిల్లీకి తిరిగొచ్చాక ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

పీసీసీ చీఫ్ పదవీ బీసీ నేతకే ఇవ్వాలనే నిర్ణయానికి అధిష్ఠానం వచ్చినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష రేసులో చివరి నిమిషం వరకు కొనసాగిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్‌లలో ఒకరిని ఫైనల్ చేసి ఏఐసీసీ ఆమోద ముద్రను వేసిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ వైపే మొగ్గు చూపిందని ఢిల్లీ పెద్దల నుంచి లీక్‌లు వెలువడుతున్నాయి. దీంతో మహేశ్‌కుమార్‌గౌడ్ అనుచ రులు హైదరాబాద్, నిజామాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.

ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ కూడా ఢిల్లీలోనే ఉండి పార్టీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు ఆయన అనుచర వర్గం చెప్తోంది. తనకు పీసీసీ చీఫ్ పదవీ ఇవ్వాలని ఢిల్లీ పెద్దలను మరోసారి కోరనున్నారు. మధుయాష్కీగౌడ్‌కు గతంలో ఎంపీగా పని చేసిన అనుభవం, ఏఐసీసీ, సోనియాగాంధీ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో చివరికి ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా మారింది.

ఇక ఈ పోస్టు కోసం ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరామ్ నాయక్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పోటీపడ్డారు. ఫైనల్ లిస్టులో గౌడ సామాజిక వర్గానికి మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్ పేర్లను ఫైనల్ చేసినట్టు ఏఐసీసీ నేతలు వెల్లడిస్తున్నారు. చివరి నిమిషనంలో ఏమైనా మార్పులు ఉంటాయా? లేదా? ముందుగా నిర్ణయించినట్టే ప్రకటన ఉంటుందా? అనే విషయంపై సంశయం నెలకొన్నది.

అయితే పీసీసీ ఎంపికలో రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ దీపాదాసు మున్షీ అభిప్రాయలు, సలహాలు, సూచనలు తీసుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త పీసీసీ, కార్యవర్గంతోనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగంలోకి దిగనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండటంతో.. మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకుంటామని పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. 

మంత్రివర్గ విస్తరణ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్.. 

మొదట పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ తర్వాతనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల నియామకం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్ ఉన్నారు. పీసీసీ చీఫ్‌గా కొత్తవారిని నియమించాక.. పాత కమిటీ రద్దవుతుంది. పీసీసీ వర్కింగ్ పోస్టుల్లో ఏఐసీసీ సూచనల మేరకు నియమిస్తారు. బీసీ వర్గానికి అధ్యక్ష పదవి ఇస్తే.. వర్కింగ్ పోస్టుల్లో ఓసీ, ఎస్సీ, ఎస్టీతోపాటు మైనార్టీ వర్గానికి అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.