calender_icon.png 12 October, 2024 | 7:49 AM

ఫీనిక్స్ స్పేసెస్ ప్రైవేటు లిమిటెడ్‌కు పీసీబీ నోటీసులు

25-08-2024 12:00:00 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రజల నివాస ప్రాంతంలో రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నిర్వహిస్తున్న ఫీనిక్స్ స్పేసెస్ ప్రైవేటు లిమిటెడ్‌కు తెలంగాణ కాలుష్య నియంత్రణా మండలి(పీసీబీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గండిపేట మండలం పుప్పాలగూడలోని సర్వే నెంబర్ 285, 286లలో క్యాప్టీవ్ రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్‌ను ఫీనిక్స్ సంస్థ నిర్వహిస్తోంది. దీంతో సమీపంలోని పలు కాలనీ ప్రజలు వాయు, శబ్ధ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ప్లాంట్‌ను మూసివేయాలని  2022 సెప్టెంబర్ 19న పీసీబీ ఉత్తర్వులు జారీ చేసింది.

కానీ ఫీనిక్స్ ప్రతినిధులు దీనిని 2024 జూన్ 26న రద్దు చేయించారు. దీంతో ఈ నెల 7, 14 తేదీలలో కాలనీ ప్రజలు మళ్లీ పీసీబీకి ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై  అధికారులు ప్లాంట్‌లో తనిఖీలు నిర్వహించారు. ప్లాంట్ కార్యకలాపాలతో కాలుష్యం ఉత్పత్తి అవుతున్నట్లు పీసీబీ అధికారులు గుర్తించారు. ప్లాంట్‌ను ఎందుకు మూసివేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ పీసీబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుకు ఏడు రోజుల్లోనే వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు.