- ఇప్పటికే రెండుసార్లు పెంచిన సర్కార్
- డిసెంబర్ నెలాఖరుకు నివేదిక సమర్పించే ఛాన్స్
- త్వరలో ఐఏఎస్ అధికారుల విచారణ
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీకే ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచనుందని సమాచారం. ఇంకా విచారణ పూర్తి కాలేదని అందుకే గడువు పెంచాలని కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసిందని ఆ నేపథ్యంలోనే గడువును మరో 2 నెలల పాటు పెంచుతారని అధికారవర్గాలు వెల్లడించాయి.
ఇప్పటి వరకే ౨సార్లు కమిషన్ గడువును 2 నెలల చొప్పున పెంచిన సర్కారు మరోసారి గడువును ఈ ఏడాది చివరి వరకు పెంచనుందని తెలుస్తోంది. అయితే ఈ నెల 12 నుంచి కమిషన్ మరోసారి విచారణ ప్రారంభిస్తుందని సమాచారం. ఇప్పటి వరకు అధికారులు, ఇంజినీర్లను, సాగునీటి రంగ ప్రముఖులను విచారించిన కమిషన్ ఇకపై ఐఏఎస్ అధికారులు, గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముఖ్య ప్రజాప్రతినిధులను సైతం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
దీంతో ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక వంతు అయితే ఇకపై జరిగే విచారణ అత్యంత కీలకంగా మారనుంది. మూడో విడత విచారణలో ప్రస్తుత, పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారుల విచారణకు ఎస్‌కే జోషి, రజత్‌కుమార్, సోమేశ్ కుమార్, స్మితా సభర్వాల్, వికాస్ రాజ్ తదితరులను ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక అప్పటి సాగునీటి మంత్రి హరీశ్‌రావు, రెండో విడత సాగునీటి శాఖను చూసిన కేసీఆర్‌ను సైతం విచారణకు పిలిచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాంతో మూడో విడత విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఈ ఏడాది చివరి నాటికి కాళేశ్వరం విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి కమిషన్ నివేదిక సమర్పించే అవకాశమున్నట్లు అధికారులు కొందరు అంచనా వేస్తున్నారు.