న్యూఢిల్లీ, జనవరి 19: కుటుంబంలో భార్యకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వ్యక్తిగత సమస్యలతో పాటు ఇంటి సమస్యలను చక్కదిద్దాల్సి వస్తుంది. నెలసరి, బిడ్డలను కనడం వంటి ఆరోగ్య విషయాలతో పాటు పిల్లలను సాకడంతో పాటు కుటుంబ విధు లు ఎన్నో ఉంటాయి. ఇలా భార్య ఎన్నో రకాలుగా సతమతమవుతుండటంతో ఓ వ్యక్తి తన సతీమణికి ప్రేమగా ‘మహిళా పన్ను’ కింద పరిహారం అందించడం ప్రారంభించాడు.
ఈ విషయాన్ని సదరు భార్య సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన భర్త తనకు మహిళా పన్ను చెల్లిస్తున్నట్టు కెమెల్లా డొ రొసారియో సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. రెండు వారాలకు ఒకసారి తనకు 85 పౌండ్లు చెల్లిస్తున్నాడని, సంవత్సరానికి 2,500 పౌండ్లు చెల్లిస్తున్నాడని పేర్కొంది. వీటిని తన మేకప్ అవసరాలకు, తల్లిగా నిర్వహించే బాధ్యతలకు సంబంధించిన స్ట్రెస్ తగ్గించే పనులపై ఖర్చు చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
అయితే ఆమె వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఇలాంటి లావాదేవీలు సబబు కాదని, ఇది వారి బంధాన్ని పలుచన చేస్తుందని కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం నిత్యం ఎంతో పని ఒత్తిడిని ఎదుర్కొనే భార్యకు తగిన పరిహారం ఇవ్వడంలో తప్పులేదని సమర్థిస్తున్నారు.