calender_icon.png 18 October, 2024 | 2:20 PM

గత అప్పులకు మిత్తీలు కడుతున్నం

18-10-2024 01:59:36 AM

  1. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
  2. వనపర్తి నల్ల చెరువులో చేప పిల్లల విడుదల

వనపర్తి, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ పదేండ్ల కాలంలో 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని.. ఆ అప్పులకు మిత్తీలు తమ ప్రభుత్వం చెల్లిస్తుందని అబ్కారీ, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు.

గురువారం వనపర్తిలో ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూ ధన్ రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా పాలనకు ఆస్మాన్ జమీన్‌కు ఉన్న ఫరఖ్ ఉందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలే అయ్యిందని.. అప్పుడే ఏదో అయిపోనట్టుగా బీఆర్‌ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, నిరంజన్‌రెడి పెడబొబ్బలు పెడుతున్నారని అన్నారు.

తక్కువ సమయంలోనే తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని స్పష్టంచేశారు. దీపావళి నాటికల్లా రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. హైడ్రా, మూసీ సుందరీకరణ బీఆర్‌ఎస్ పుణ్యమేనని.. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాల్వలు, కబ్జాలు కాకుండా చూస్తున్నామని పునరుద్ఘాటించారు.  

గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణం 

నైతిక విలువలు, దేశభక్తి పెంపొందించడంలో గ్రంథాలయాలు తోడ్పడతాయని మంత్రి జూపల్లి అన్నారు. వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన లంకల గోవర్థన్ సాగర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలసి మంత్రి  పాల్గొన్నారు. తాను డిగ్రీ పూర్తి చేయడానికి హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ లైబ్రరీ ప్రధాన కారణమని  తెలిపారు. 

పర్యాటక ప్రాంతంగా నల్లచెరువు

జిల్లాలోని నల్లచెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి  పేర్కొన్నారు. జిల్లా మత్య్సశాఖ ఆధ్వర్యంలో నల్ల చెరువులో 70 వేల చేప పిల్లలను వదిలారు. మంత్రి వెంట డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర గ్రంథాయాల అధ్యక్షుడు రియాజ్, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.