గజ్వేల్ ఆర్డీవోకు వెల్లడించిన ఆర్‌ఆర్‌ఆర్ బాధితులు
గజ్వేల్, డిసెంబర్4: బహిరంగ మార్కెట్‌లో ఉన్న భూముల ధర కంటే మూడురెట్లు ఎక్కువ చెల్లిస్తేనే రీజినల్ రింగురోడ్డుకు తమ భూము లు ఇస్తామంటూ భూములు కోల్పోతున్న రైతులు తమ నిర్ణయాన్ని స్పష్టం చేశారు. రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి భూసేకరణలో భాగంగా కలెక్టర్ మనూచౌదరి ఆదేశాల మేరకు గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ మండలాల వారీగా రైతులతో చర్చిస్తున్నారు.
బుధవారం రాయపోల్ మండల రైతులతో ఆర్డీవో చంద్రకళ భూసేకరణ, నష్టపరిహారంపై చర్చించడానికి వస్తుండగా ఐవోసీ బయటనే జగదేవ్‌పూర్, గజ్వే ల్, వర్గల్, రాయపోల్ మండలాలకు చెందిన రైతులు అడ్డుకొని వెనక్కి పంపించారు. తాము మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయినప్పుడు అధికారులు చర్చల పేరుతో తమను మభ్య పెట్టారని, దానివల్ల సర్వం కోల్పోయి ఉపాధి కోల్పోయామని వాపోయా రు. తమ భూములు హెచ్‌ఎండీ ఏ పరిధిలో ఉన్నందున ఎకరాకు కోటికి పైగా బహిరంగ మార్కెట్‌లో విలువ ఉన్నదని, ప్రభుత్వ ధర ప్రకారం పరిహారం ఇస్తే నష్టపోతామన్నారు.