calender_icon.png 27 October, 2024 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలబిల్లులు చెల్లించాలి

13-08-2024 03:02:13 AM

సిద్దిపేట, ఆగస్టు 12(విజయక్రాంతి): రెండున్నర నెలలుగా పాలబిల్లులు చెల్లిచడం లేదని పాడిరైతులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ వద్ద అధికారులను కలిసి తమ గోడును వెళ్లబోసుకోగా వారు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో రైతులందరూ సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. రైతులు మాట్లాడుతూ.. జిల్లాలో 6వేల మంది రైతులు ప్రతి రోజు 32వేల లీటర్ల పాలను విజయ డెయిరీకి విక్రయిస్తున్నారన్నారు. రోజుకు రూ.12.80 లక్షల బిల్లు అవుతోందని.. పదిహేను రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

అయితే రెండున్నర నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలోని రైతులకు ప్రభుత్వం (విజయ డెయిరీ) రూ.9.6కోట్లు బకాయి ఉందన్నారు. దీనికి అదనంగా ప్రతి లీటర్ పాలకు రూ.4 ప్రోహత్సకం ఇస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. దీనికి భిన్నంగా అసలు బిల్లు లేదు, ప్రోత్సాహకం లేకపోవడంతో పశువుల పోషణ ఇబ్బందిగా మారిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రామాచంద్రం, బుచ్చి రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రశాంత్ శర్మ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.