calender_icon.png 5 March, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బకాయిలివ్వండి

05-03-2025 01:00:47 AM

కేంద్ర పౌరసరఫరాలశాఖ నుంచి రావాల్సినవి రూ.1,891 కోట్లు

  1. 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులివ్వండి 
  2. సీఎంఆర్ అప్పగింత గడువును 4 నెలలకు పెంచండి
  3. తద్వారా బియ్యం సరఫరాలో ఇబ్బందులు తలెత్తవు..
  4. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ వినతి

* రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలనుకుంటున్నది. అందు కు ఎక్కువ మొత్తంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులిస్తే బాగుంటుంది.

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): కేంద్ర పౌరసరఫరాలశాఖ నుంచి తెలంగాణకు రూ.1,891 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, వాటిని వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆహార, పౌర సరఫరాలశాఖ, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషిని మర్యాదపూర్వకంగా కలిసి కోరారు.

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు 2014- -15 వానకాలంలో తెలంగాణ ప్రభుత్వం అప్పగించిన బియ్యానికి సంబంధించిన రూ. 1,468.94 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని గతంలో రాష్ట్రప్రభుత్వమే భరించిందని వివరించారు.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్‌లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధ్రువీకరిం చుకొని అందుకు సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లు, 2021 జూన్ నుంచి 2022 ఏప్రిల్ వరకు నాన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును నెల రోజుల నుంచి నాలుగు నెలలకు పెంచాలని కోరారు. తద్వారా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని కేంద్ర మంత్రికి తెలియజేశారు. తెలంగాణకు ప్రధానమంత్రి కుసుమ్ యోజన కింద గతంలో అనుమతులిచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమ తులను పునరుద్ధరించాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.

కేంద్రం తొలుత 4  వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అనుమతులిచ్చి, తర్వాత ఆ మొత్తాన్ని వెయ్యి మెగావాట్లకు కుదించిందన్నారు. రాష్ట్రప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలనుకుంటున్నదని, అందుకు ఎక్కువ మొత్తంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులిస్తే బాగుంటుందని తెలిపారు.

ముఖ్యమంత్రి, మంత్రి వెంట సీఎం కార్యాలయ కార్యదర్శి మాణిక్‌రాజ్, రాష్ర్ట పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్  ఉన్నారు.