calender_icon.png 17 October, 2024 | 4:53 AM

దసరా లాభాల నుంచి బాండ్ డబ్బులు చెల్లించండి

17-10-2024 02:48:40 AM

ఆర్టీసీఎండీ సజ్జనార్‌కు జేఏసీ విజ్ఞప్తి

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణలో సద్దుల బతుక మ్మ, దసరా సందర్భంగా ఆర్టీసీకి అత్యధిక లాభాలు వచ్చాయని, వాటి నుంచి తమ పెండింగ్ బాండ్ డబ్బులు చెల్లించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ వెంకన్న, ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి బుధవారం ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం సమర్పించారు.

2013 పీఆర్‌సీ బాండ్ డబ్బులు డ్రైవర్, కండక్టర్లు, గ్యారేజీ, సెక్యూరిటీ సిబ్బందికి మాత్రమే చెల్లించి మిగతా వారికి చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా రూ. 70 కోట్ల ఆదాయం వచ్చినందున, ఆర్థిక వెసులుబాటు ఉన్నందున వెంటనే తమకు రావాల్సిన బాండ్ డబ్బులు చెల్లించాలని కోరారు.

రిటైర్డ్ ఉద్యోగులకు సెటిల్మెంట్ బకాయి ల చెల్లింపుతో పాటు 2017 పీఆర్సీని రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలని కోరారు. ఉద్యోగులందరికీ కొత్త అలవెన్సులు పెంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే హయ్యర్ పెన్షన్ కోసం డిమాండ్ నోటీసులు సకాలంలో యాజమాన్యానికి సమర్పించక పోవడంతో వాటికి గడువు ముగిసిందనే నెపంతో తిరస్కరించినందున మరో అవకాశం ఇవ్వాలని కోరుతూ రీజినల్ ప్రావి డెంట్ ఫండ్ కమిషనర్, ఆర్టీసీ ఎండీకి జేఏసీ నేతలు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు.