calender_icon.png 1 October, 2024 | 12:55 PM

తెలంగాణ రుణం తీర్చుకోండి

05-09-2024 01:37:41 AM

  1. వరదలను వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలి

కేంద్రానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి): కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 లోక్‌సభ స్థానాలిచ్చి బీజేపీకి ప్రాణం పోశారని చెప్పారు. అసాధరణ రీతిలో కురిసిన కుండపోత వర్షాలకు రాష్ట్రంలోని 14 జిల్లాలు జల ప్రళయానికి గుర య్యాయని, 16 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తెలంగాణ వరద బీభత్సాన్ని జాతీ య విపత్తుగా ప్రకటించి, ఉదారంగా సాయం అందించాలని కోరారు.

నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్న సందర్భంలో మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. విపత్తు సాయం కింద తెలంగాణకు రూ.5,500 కోట్లు కేటాయించి వెంటనే రూ.2 వేల కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు. క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా కొద్ది గంటల్లోనే నెల రోజుల వర్షం కురిసిందని వివరించారు. తమ ప్రభుత్వం అప్రమ త్తంగా వ్యవహరించి, అధికారులను మోహరించడం వల్ల మృతుల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి జాతీయ విపత్తుగా ప్రకటించడంతోపాటు ప్రత్యేక నిధులు అందజేయాలని కోరారు.

బీజేపీకి రహస్య మిత్రుడిగా కొనసాగుతున్న బీఆర్‌ఎస్ కూడా జాతీయ విప త్తుగా ప్రకటించాలని డిమాండ్ చేయాలని సూచించారు.బురద రాజకీయాలను మానుకుని చేతనైతే వరద బాధితులకు సాయం చేయాలని గులాబీ పార్టీకి హితవు పలికారు. ఇళ్లలో కూర్చుని మీడియాలో చెలరెగితే ప్రయోజనం ఉండదని ఎద్దేవాచేశారు. ఉత్తర తెలంగాణలోని నీటి ప్రాజెక్టులైన కడెం, స్వర్ణ, వట్టివాగు, సాత్నాల, ఎన్టీఆర్ ప్రాజెక్టు, గడ్డెన్న వాగు, పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టుల నీటి విడుదల సామర్థ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందించి సహకరించాలని కోరారు. ఆకస్మిక వరదల సమయంలో ఈ ప్రాజెక్టుల భద్రత ఆందోళ న కలిగిస్తోందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి జాతీయ విపత్తు డిమాండ్‌ను ముందుంచుతామని పేర్కొన్నారు.