calender_icon.png 25 October, 2024 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్వాసితులకు పరిహారం చెల్లించండి

22-07-2024 01:55:53 AM

ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, జూలై 21(విజయక్రాంతి): లద్నాపూర్ ఓపెన్ కాస్ట్ మైన్ కోసం సింగరేణి కాలరీస్ సేకరించిన భూమిలో ఇండ్లు నిర్మించుకున్న 280 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరహారం విషయంపై లబ్ధిదారులతో చర్చలు జరపాలని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.  ఆదివారం సచివాలయంలో సింగరేణి అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. మంథని నియోజకవర్గం రామ గిరి మండలం లద్నాపూర్‌లో ఓపెన్ కాస్ట్ మైన్ కోసం 2012లో 103 ఎకరాల భూమి ని సింగరేణి సంస్థ సేకరించింది. అందులో 466 ఇళ్లకు నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ కింద 721 మందికి, ఒక్కో పౌరుడికి రూ.7.5 లక్షల చొప్పున చెల్లించింది.

నివాసాలు కోల్పోయినందుకు, పునరావాసానికి సింగరేణి మొత్తం రూ.145 కోట్లు  విడుదల చేసింది. భూమి సింగరేణి పరమైన తర్వాత అదే భూమిలో కొందరు ఇళ్లు నిర్మించుకుని మళ్లీ నష్టపరిహారం కోరారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ బాబు చొరవతో వారికి రూ.30 కోట్ల పరిహారాన్ని సింగరేణి సంస్థ అందించింది. నిర్వాసితులుగా చెబుతున్న మరో 280 మందికి ఆర్ అండ్ ఆర్ చెల్లింపులో చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకు రాగా వారందరితో మాట్లాడి మానవతా దృక్పథంతో పరిహారం అందించి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సింగరేణి సిఎండీ బలరాం, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష కోయా, మంథని ఆర్డీవో హనుమా నాయ క్ తదితరులు పాల్గొన్నారు.