calender_icon.png 17 October, 2024 | 2:32 AM

ఇస్తామన్న పరిహారం చెల్లించండి

17-10-2024 12:15:13 AM

మున్నేరు వరద బాధితుల డిమాండ్, ఆందోళన

మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరిక

ఖమ్మం, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఖమ్మం నగరానికి వరదలు వచ్చి రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్ట పరిహారం ఇంతవరకు రాకపో వడంతో మున్నేరు వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం బుధవారం ఆందోళనకు దిగారు.

సర్వేలు చేసిన అధికారులు తమల్ని ఎందుకు విస్మరించారో చెప్పాలని ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం ఇస్తామన్న రూ.16,500 ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని అధికారులను మహిళలు ప్రశ్నించారు. ప్రతి ఇంటికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పైగానే నష్టం వాటిల్లిందని వాపోయారు.

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండి తమకు ఎందుకు న్యాయం చేయడం లేదన్నారు. ఇప్పటికైనా తమల్ని ఆదుకోకపోతే ముగ్గురు మంత్రుల ఇళ్లను, కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సర్వే చేపట్టిన అధికారులు కొన్ని ఇళ్లకు అసలే రాలేదని తెలిపారు. కేవంల నాయకులు చెప్పిన పేర్లే రాసుకుని పోయారని ఆరోపించారు.

కొంత మంది అధికారులు, నాయకులు కుమ్మక్కై వరద బాధితుల సాయాన్ని కాజేశారని ఆరోపించారు. విచారణ జరిపి, నిజమైన బాధితులకు న్యాయం చేయాలని మంత్రులను వేడుకున్నారు. నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.3 లక్షల సాయం అందించాలని కోరారు. బాధితులకు మద్దతుగా అఖిల పక్ష నేతలు నున్నా నాగేశ్వరరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, గుండాల కృష్ణ, నూనె శశిధర్ పాల్గొన్నారు.