08-04-2025 09:41:32 AM
చేతులు, కాళ్ళకు గాయాలు... ఆసుపత్రిలో చికిత్స
మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ పయనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Pawan Kalyan Son Mark Shankar) సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం(School fire) జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. మార్క్ శంకర్(Mark Shankar)ను తక్షణమే సింగపూర్ లోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharama Raju district) పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ కి ఈ విషయం తెలిసింది. పర్యటన నిలిపివేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని సూచించారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాదంపై మెగా ఫ్యామిలీ ఇప్పటికే ఆరా తీసినట్లు సమాచారం.