20-04-2025 10:17:10 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు(CM Chandrababu birthday) సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడును “అసాధారణ, అసమానమైన సాధకుడు” అని పేర్కొంటూ, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హృదయపూర్వక వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి దిశను కోల్పోయిన, శాంతిభద్రతల విచ్ఛిన్నతను ఎదుర్కొన్న రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు వంటి దార్శనికుడు మాత్రమే పునరుద్ధరించగలడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అటువంటి పరివర్తనాత్మక నాయకత్వం చాలా అరుదు, ప్రశంసనీయమని ఆయన తెలిపారు. అనుభవజ్ఞుడైన నిర్వాహకుడికి తన హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు పునరుద్ఘాటించారు.
నారా చంద్రబాబు నాయుడు నాల్గవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం అన్నారు. భవిష్యత్తను ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలన నడిపించే విధానం స్పూర్తిదాయకం అన్నారు. “ఆయన వజ్రోత్సవ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నేడు యూరప్‌లో తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా, తెలుగుదేశం పార్టీ (టిడిపి) ఈ మైలురాయిని గుర్తుచేసుకునేందుకు ఘనంగా వేడుకలు నిర్వహించింది. చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రార్థనలు నిర్వహించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.