అమరావతి: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి రోజూ ఒక ప్రజా ప్రతినిధి అయినా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. అధికారంలోకి వచ్చామని దుర్వినియోగం చేయొద్దని సూచించారు. రౌడీయిజాన్ని నమ్మొద్దు, దురుసుగా మాట్లాడ్డం, బెదిరింపు ధోరణితో వెళ్లడం కరెక్ట్ కాదని తెలిపారు. ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే.. వారిని తాను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటానని హెచ్చరించారు. మహిళా నేతలను ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో విమర్శించినా సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. సంస్కరించాల్సిన మనమే, తప్పులు చేయకూడదని డిప్యూటీ సీఎం వెల్లడించారు. జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల సత్కార కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను పవన్ కల్యాణ్ సత్కరించారు.