calender_icon.png 22 September, 2024 | 3:53 PM

తిరుమల లడ్డూ కల్తీ.. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష

22-09-2024 02:06:56 PM

గుంటూరు: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై ఆవేదనతో గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టే ముందు దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన చేశారు. పూజలు నిర్వహించిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. దీక్ష పూర్తయ్యాక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తిరుమల శ్రీవారి లడ్డూను మహా ప్రసాదంగా భావిస్తామన్నారు. 

పవిత్ర తిరుపతి లడ్డూ నైవేద్యాన్ని కల్తీ చేశారన్న ఆరోపణలకు ప్రతిస్పందనగా ఈ ప్రతిజ్ఞ హిందూ మత సూత్రాలను ఉల్లంఘించిందని కళ్యాణ్ అభివర్ణించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులోని హిందూ అధికారులు, పవిత్ర నైవేద్యంలో రాజీ జరిగిందని ఎందుకు మౌనంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. లడ్డూను అపవిత్ర చేస్తుంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏం చేశారు? తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారు? అని పవన్ ప్రశ్నించారు. ఇంతటి ఘోరమైన తప్పిదంపై టిటిడి ఉద్యోగులు మౌనం వహించడం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తామన్నారు. దోషులకు కఠిన శిక్ష పడాల్సిందేనని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. లడ్డూ అంశంపై కేబినెట్ బేటీలో, అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. తన దీక్ష రాజకీయ ప్రేరేపితమైనది కాదని, వ్యక్తిగత భక్తితో చేసిన దీక్ష అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.