అమరావతి: పల్నాడు జిల్లాలో సరస్వతి భూములను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఎమ్మెల్యే యరపతినేని, కలెక్టర్, అటవీ, రెవెన్యూ అధికారులతో కలిసి పవన్ మాచవరం మండలం, వేమవరం, చెన్నాయపాలెంలో భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... ఉద్యోగాలు ఇస్తాం.. భూములు అమ్మండని లాక్కున్నారు. ఇష్టం లేకున్నా భూములు అమ్మాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. గతంలో పెట్రోల్ బాంబులు వేసి భయపెట్టారు.. కోడెల శిపప్రసాదరావును వేధించి వేధించి చంపేశారు. ఫర్నిచర్ పై శివప్రసాదరావు వేధించిన వ్యక్తి.. ప్లాంట్ పేరుతో భూములు లాక్కున్నారని ఆరోపించారు. ఎస్సీ కుటుంబాలకు చెందిన 24 ఎకరాలను భయపెట్టి తీసుకున్నారు. లాక్కున్న భూముల్లో 20 ఎకరాలు వేమవరంలోనే ఉన్నాయి. ఎవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.. భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని పవన్ భరోసా ఇచ్చారు. 400 ఎకరాల అటవీ భూముటంటే.. రెవెన్యూ భూములుగా మార్చేశారని విమర్శించారు. 2009లో 30 ఏళ్లకు లీజుకు తీసుకుని.. 50 ఏళ్లకు లీజు పెంచేశారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సహజ వనరులు ఒకరి సొంతం కాదు.. సహజ వనరులు ఇస్తే ఉద్యోగాలు కల్పించాలి..?, నిర్మించని సిమెంటు కంపెనీకి 196 కోట్ల లీటర్లు నీరా..? అని పవన్ ప్రశ్నించారు. పోలీసు అధికారులు మెత్తబడిపోయారు.. లేదా భయపడుతున్నారు. గత ప్రభుత్వం ఇక్కడున్న యువతను భయపెడితే ఊరుకుంటారా..? పెట్రోల్ బాంబు, నాటు బాంబులు వేసి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులది, రౌడీయిజాన్ని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదని పవన్ సూచించారు. వైసీపీ నాయకులు.. ఇంకా వాళ్లే ప్రభుత్వంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు అంటే ఎంత బలంగా ఉంటాయో వాళ్లకు చేసి చూపించాలని ఆదేశించారు.