calender_icon.png 20 April, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదురుతున్న వివాదం

16-03-2025 12:00:00 AM

నియోజక వర్గాల పుర్విభజనతో పాటుగా త్రిభాషా విధానంపై తమిళనాడులో గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ త్రిభాషా విధానంపై చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. పిఠాపురంలో శుక్రవారం జరిగిన పార్టీ ఆవిర్భావసభలో పవ న్ కల్యాణ్ మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం హిందీని కేంద్రం రాష్ట్రం పై బలవంతంగా రుద్దుతోందంటూ వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు. దక్షిణాదిపై కేంద్రం హిందీని బలవంతంగారుద్దుతున్నారని మాట్లాడుతున్న ప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్బింగ్ ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై  డీఎంకే కూడా ఘాటుగా స్పందించింది.

భాషా విధానంపై తమిళనాడు వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని పార్టీ అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా అన్నారు. వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలను నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్నా రు. ఆసక్తి ఉన్న వాళ్లు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిం దీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామన్న ఆయన అయితే కేంద్రప్రభుత్వం మాత్రం ఎన్‌ఈపీ, పీఎం శ్రీస్కూల్స్ వంటి విధానాలతో రాష్ట్ర ప్రజలపై హిందీ భాషను రుద్దడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.

కాగా 1938 నుంచే తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ద్విభాషా విధానాన్నే అమలు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని కూడా అమలు చేసుకున్నామని మరో సీనియర్ నేత ఎళంగోవన్ అన్నారు.1968లో బిల్లు ఆమోదం పొందినప్పుడు పవన్ కల్యాణ్ ఇంకా పుట్టి ఉండరని, తమిళ రాజకీయాలపై ఆయనకు అవగాహన లేకపోయి ండొచ్చంటూ కాస్త ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సమర్థించే వారు, వ్యతిరేకించేవారు చేసే ప్రకటనలతో ఈ వివాదం మరిం త ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే స్టాలిన్ ప్రభుత్వం ఈ వివాదాన్ని మరింత రాజేసేలాగే కనిపిస్తోంది. బడ్జెట్ ప్రసంగం పాఠంపై రూపీ స్థానంలో తమిళ గుర్తును ఉం చడం తాజా మలుపు. ఈ చర్య ద్వారా స్టాలిన్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ నేతలను మరింత రెచ్చగొట్టినట్లయింది. మరోవైపు నియోజక వర్గా ల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయం పై ఈ నెల 22న ఏర్పాటు చేసిన సదస్సుకు దక్షిణాదిలోని దాదాపు అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఇప్పటికే  తెంగాణ ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి పూర్తి మద్దతు ప్రకటించగా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ కూడా మద్దతు తెలిపింది.

తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ సమావేశానికి మద్దతు తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వామి అయిన డీఎంకే ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తాము తప్పక హాజరవుతామని కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ప్రకటించారు. అన్నిటికి మించి ఒడిశాలో దాదాపు పాతికేళ్ల పాటు అధికారంలో కొనసాగిన, ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న బిజూ జనతాదళ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతుండడం విశేషం. ఈ సమావేశం ద్వారా స్టాలిన్ మరోసారి ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తేవడంతో పాటు హిందీ వ్యతిరేక ఆందోళనలతో కలిపి వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకొంటున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం దీనిపై తన వైఖరిని స్పష్ట చేయకపోవడం గమనార్హం. ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉండడమే అందుకు కారణంగా భావించవచ్చు. ఇంత గొడవ జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ నేతలు సన్నాయి నొక్కులతో సరిపెడుతున్నారే తప్ప ఈ రెండు ప్రధాన అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వెనుక బీజేపీపెద్దలకు అన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మాదిరిగా తమిళనాడులో కూడా ఏదైనా రహస్య అజెండా ఉందేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి.