మౌలిక వసతులపై అధికారులు ద్రుష్టి సారించాలి
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తండాలు, గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక ద్రుష్టి సారించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పక్క రహదారులు, డ్రైన్లు, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు అనతికాలంలోనే పూర్తి చేసి రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. చుంచుపల్లి మండలంలోని సర్వారం, నర్సింహాసాగర్, కొత్త అంజనాపురం, బేతంపూడి, సింగభూపాలెం పంచాయతీ పరిధిలో రూ.1.60కోట్ల అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా జరిగిన శంకుస్థాపన సభల్లో కూనంనేని మాట్లాడుతూ.. గతపాలకుల నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను గుర్తించి ఆ గ్రామాలకు కావాల్సిన రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, త్రాగునీరు వంటి కనీస మౌలిక వసతులు కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులపై సర్వే నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ అధికారులకు సూచించారు.
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు నిత్యం పర్యవేక్షించాలని, నాణ్యతతో నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, లోపాలను గుర్తిస్తే తక్షణమే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మండల టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు సిపిఐ మండల కార్యదర్శి భూక్యా దస్రు, జిల్లా సమితి సభ్యులు కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు ఎమ్మార్వో శిరీష, ఎంపిడివో భారతి, ఏవో నర్మదా, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ నిలోఫర్, పి ఆర్ డి ఈ సత్యనారాయణ, ఏ ఈ శివలాల్, విద్యుత్ ఏ ఈ కిషన్, సిపిఐ నాయకులు పొదిల శ్రీను వీర్ల మల్లేష్, బొడ్డు కేశవరావు దుర్గ, కుమారి కృష్ణ, మేకల వెంకటేష్, తేజ, ఎట్టి వెంకటేష్, మాన్త్యా నాయక్, భాగం కృష్ణ, హత్థిరాం, రఫి కాంగ్రెస్ సిపిఐ నాయకులు ప్రజాసంఘాల బాధ్యులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.