వికారాబాద్,(విజయక్రాంతి): పట్నం నరేందర్ రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్ నుంచి భారీ బందోబస్తుతో కొడంగల్ తరలించారు. పోలీసులు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి నరేందర్ రెడ్డిని తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. లగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై సోమవారం దాడి చేసిన కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన భోగమోని సురేష్ పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతరులపై అధికారులు కేసులు నమోదు చేశారు. అదనంగా, కలెక్టర్‌పై దాడికి గ్రామస్తులను ప్రేరేపించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.