హైదరాబాద్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గత నెలలో వికారాబాద్ కలెక్టర్, కొందరు రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడ్డ లగ్గచర్ల ఘటనకు సంబంధించి పట్నం నరేందర్‌రెడ్డికి కొడంగల్ కోర్టు శుక్రవారం రెండు రోజుల పోలీసు కస్టడీని మంజూరు చేసింది. లగచర్ల కేసులో విచారించేందుకు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.
శాంతిభద్రతల సమస్యలు సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పథకం పన్నారనే ఆరోపణలతో నరేందర్ రెడ్డి ఈ కేసులో కీలక నిందితుడు. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న నరేందర్‌రెడ్డిని పరిగి పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకుని విచారణ నిమిత్తం వికారాబాద్‌కు తరలించారు. నిందితుడిని న్యాయవాది సమక్షంలోనే ప్రశ్నించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతోనే నరేందర్ రెడ్డి లగ్గచర్లలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టారని ఆరోపణలున్నాయి. పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.. కానీ అన్‌లాక్ చేయలేకపోయారు. విచారణలో, కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు పొందడానికి నరేందర్ రెడ్డి సమక్షంలో పోలీసులు మొబైల్ ఫోన్‌ను తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.