హైదరాబాద్,(విజయక్రాంతి): చర్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని న్యాయవాదులు గురువారం కలిశారు. న్యాయవాదుల ద్వారా కోర్టుకు అఫిడవిట్ ను పంపించారు. పోలీసులు తన స్టేట్ మెంట్ ను తీసుకోలేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు పేపర్లపై తన సంతకం తీసుకున్నారని, పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అని చెప్పారు. అరెస్టుకు ముందు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వాలేదని, బుధవారం ఉదయం వాకింగ్ చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేసి ఈ కేసులో ఇరికించారని నరేందర్ రెడ్డి వాపోయ్యారు. బలవంతంగా కారు ఎక్కించి వికారాబాద్ తీసుకెళ్లారని, కేటీఆర్, ఇతర నేతల ఆదేశాలతో దాడులు జరిగినట్లు కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. పోలీసులకు కేటీఆర్ గురించి ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, కోర్టుకు వచ్చాక తన న్యాయవాది అడిగితే రిమాండ్ రిపోర్టు ఇచ్చారని చెప్పారు. ఇప్పటి వరకు ఆ రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పినవి ఏవి నిజాం కాదని, తన స్టేట్ మెంట్ ను పరిగణలోకి తీసుకొని విచారణ జరిపించాలని కోర్టును పట్నం నరేందర్ రెడ్డి కోరారు.