calender_icon.png 14 November, 2024 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్నం అరెస్ట్

14-11-2024 01:54:54 AM

  1. మేజిస్ట్రేట్ ఎదుట హాజరు.. 14 రోజుల రిమాండ్ 
  2. చర్లపల్లి జైలుకు తరలింపు.. 
  3. కాంగ్రెస్ నేతలతో వికారాబాద్ కలెక్టరేట్‌కు వచ్చిన ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి
  4. కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో గంటపాటు భేటీ

హైదరాబాద్/ వికారాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): లగచర్ల భౌతికదాడుల కేసులో ఏ1 నిందితుడిగా బుధ వారం ఉదయం పోలీసులు మాజీ ఎమ్మె ల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నరేందర్‌రెడ్డి ఉదయం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఆయనకు వైద్యప రీక్షలు నిర్వహించి వికారాబాద్‌లోని డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ (డీటీసీ)కి తరలించారు. విచారణ అనంతరం పోలీసులు ఎవరికీ అనుమానం రాకుండా వికారాబాద్ సీఐ వాహనంలో నరేందర్‌రెడ్డిని పరిగి పీఎస్‌కు తరలించారు. ఐజీ సత్యనారాయణ సైతం అదే వాహనంలో వెళ్లారు. పరిగి పీఎస్‌లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అనంతరం నరేందర్‌రెడ్డిని కొడంగల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్ కోసం చర్లపల్లి జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని పోలీసులు డీటీసీకి తీసుకొచ్చారని సమాచారం అందుకున్న బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్‌రెడ్డి కార్యకర్తలతో డీటీసీకి తరలివచ్చారు.

అధికారులపై జరిగిన దాడి కుట్రలో నరేందర్‌రెడ్డి ప్రమేయం లేదని నినాదాలు చేశారు. రాష్ట్రప్రభుత్వం రాజకీయంగా కుట్ర లు పన్ని నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఆయన్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నరేందర్ రెడ్డిని టెర్రరిస్టును అదుపులోకి తీసుకుంటున్నట్లు  అరెస్ట్ చేశారని అభ్యంతర వ్యక్తం చేశారు. 

మరోవైపు సీఎం సోదరుడు, కాంగ్రె స్ పార్టీ కొడంగల్ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి సుమా రు 300 మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు.  అనంతరం కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో గంట పాటు భేటీ అయ్యారు. కేసుపై పలు అంశాలను చర్చించారు.

రెండు పార్టీలకు చెందిన శ్రేణులు డీటీసీ, కలెక్టరేట్‌కు రావడంతో వికారాబాద్‌లో హైటెన్షన్ నెలకొన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పోలీసులు, అధికారవర్గాలు ఆందోళన చెందాయి. పోలీసు బల గాలు భారీగా ఆ ప్రాంతాలను మోహరించా రు. సంయమనంతో రెండు పార్టీల నేతలు డీటీసీ, కలెక్టరేట్ నుంచి వెళ్లేలా చేశారు.

మాజీ ఎమ్మెల్యేను విచారించిన ఐజీ..

మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ మధ్యాహ్నం డీటీసీకి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని సుమారు గంట పాటు విచారించారు. బీఆర్‌ఎస్ నేత సురేశ్‌తో నరేందర్‌రెడ్డికి ఉన్న సంబంధాలు, సురేశ్ కేవలం కార్యకర్తగానే పరిచయమా? లేదా వ్యక్తిగత లావాదేవీలేమైనా చూస్తాడా? సురేశ్‌పై ఉన్న కేసులను తొలగించేందుకు ఏమైనా ప్రయత్నించారా? అధికారులపై దాడులు జరిగే ముందు సురేశ్ ఏమైనా కాల్ చేశాడా? ఒకవేళ కాల్ చేస్తే సురేశ్‌కు మీరేం సూచించారు? ఒకేరోజు 42 సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమోచ్చింది ? వంటి ప్రశ్నలు నరేందర్‌రెడ్డిని ఐజీ అడిగినట్లు విశ్వాసనీయ సమాచారం.  

కొడంగల్‌లో బీఆర్‌ఎస్ నిరసన..

మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్టుతో కొడంగల్‌కు చెందిన బీఆర్‌ఎస్ నేతలు పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీజాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నరేందర్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారులపై జరిగిన దాడిని ప్రభుత్వం రాజకీయ కోణం లో చూస్తుందని, అందుకే కేవలం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేస్తున్నదని ఆరోపించారు. పోలీసులు ఆందోళనకా రులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అరెస్టులు, విచారణ వేగవంతం..

కేసులో అరెస్ట్‌ల పర్వం వేగవంతమైంది. పోలీసులు ఇప్పటికే 42 మందిని విచారించారు. కోర్టు ఆదేశాల మేరకు 21 మందిని రిమాండ్‌కు తరలించారు. కేసుపై పోలీసులు లోతైన విచారణ చేపడతున్నారు. ఘటన జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్న బీఆర్‌ఎస్ నేత బోగమోని సురేశ్‌తో పాటు మరికొందరు సూత్రధారులను పట్టుకునే పనిలో పడ్డారు. దాడుల వెనుక సురేశ్ పాత్రపై లోతైన విచారణ చేపడుతున్నారు

ఆయనే ఏ1 

  1. 47 మంది గుర్తింపు, 21 మంది అరెస్ట్.. రిమాండ్
  2. దాడిచేసిన వారిలో 19 మందికి అసలు భూమి లేదు
  3. పరారైన వారికోసం గాలింపు
  4. ఐజీ వీ సత్యనారాయణ వెల్లడి

వికారాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): లగచర్ల భౌతికదాడుల కేసులో ఏ1 నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని మల్టీజోన్ ఐజీ వీ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన వికారాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో రెండు గంటల పాటు భేటీ అయ్యారు.

అనంతరం ఐజీ మీడియాతో మాట్లాడారు. డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు విచారణను వేగవంతం చేశారన్నారు. పక్కా సాంకేతిక ఆధారాలతోనే ఏ1 నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశామని, కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించామని స్పష్టం చేశారు. 

దాడుల వెనుక నరేందర్‌రెడ్డి పాత్రపై తాము కోర్టుకు ఆధా రాలు సమర్పించామన్నారు. కోర్టు వాటిపై సంతృప్తి చెంది 14 రోజులు రిమాండ్ విధించిందని వివరించారు. ఫార్మాసిటీ విషయంలో అధికారులకు సహకరించొద్దని నరేందర్‌రెడ్డి రైతులకు సూచించారని తెలిసిందన్నారు. నరేందర్‌రెడ్డిని పోలీస్ కస్టడీ కోరుతూ ఫిటిషన్ దాఖలు చేశామన్నారు.

అధికారులపై దాడి చేసేందుకు కొందరు ముందుగానే కారం పొడి, కర్రలు సిద్ధం చేశార న్నారు. కుట్రదారులు కొందరికి మద్యం సైతం సమకూర్చారని తెలిసిందన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 47 మందిని గుర్తించామని, ఇంకా ఎంతోమందిని గుర్తించాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 21 మందిని జ్యూడీషయల్ రిమాండ్‌కు తరలించామని స్పష్టం చేశారు.

రైతులు కాకుండానే దాడులకు పాల్పడిన వారు కొందరు పరారీలో ఉన్నారని, వారి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. దాడుల వెనుక విఠల్, దేవదాస్, గోపాల్ నాయక్, సురేశ్, రాజు, విజయ్ ప్రధాన సూత్రధారులని గుర్తించామన్నారు. పోలీసులు ఇప్పటివరకు 42 మందిని విచారించారని, వారిలో 19 మందికి అసలు వ్యవసాయ భూమి లేదని తేలిందన్నారు.

నిందితులైన సురేశ్, మహేశ్‌కు చెందిన భూములు ఫార్మా సిటీ పరిధిలో లేవన్నారు. అయినప్పటికీ ఇద్దరూ పక్కా స్కెచ్ రూపొందించి, కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులకు గ్రామంలోకి ఆహ్వానించారని వెల్లడించారు. దాడులతో ఎలాంటి సంబంధం లేని 37 మందిని తొలిరోజే వదిలేసినట్లు తెలిపారు. దాడులతో ప్రమేయం లేని గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న పోలీసులు

రైతులను పరామర్శించేందుకు ఎంపీ డీకే అరుణ ప్రయత్నించగా, పోలీసులు ఆమెను మన్నెగూడ వద్ద అడ్డుకు న్నారు. దీంతో ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా తాను రైతులను పరామర్శించేందుకు వెళ్తున్నానని, కావాలంటే పోలీసులు సైతం తన వెంట రావొచ్చని ఆమె సూచించారు. పోలీసులు అయినప్పటికీ ఎంపీని ముందుకు వెళ్లనీయలేదు. దీంతో ఆమె నేరుగా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు కాల్ చేసి ఫోన్‌లో మాట్లాడారు. 

కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు ఎంపీని వికారాబాద్ కలెక్టరేట్‌కు తీసుకువెళ్లారు. ఎంపీ డీకే అరుణ కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో భేటీ అయ్యారు. లగచర్ల భౌతిక దాడులపై కలెక్టర్‌తో చర్చించారు. దాడులతో ప్రమేయం లేని అమాయకులపై కేసులు పెట్టకుండా చూడాలని ఆమె కలెక్టర్‌కు సూచించారు.