22-03-2025 12:11:18 AM
నల్లగొండ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ అరుణకుమారి
నల్లగొండ, మార్చి 21 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని దవాఖాన సూపరింటెండెంట్ అరుణకుమారి ఆదేశించారు. నల్లగొండ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్రతో కలిసి దవాఖానను శుక్రవారం ఆమె పరిశీలించారు. వార్డు.. వార్డులో తిరిగి పారిశుధ్య నిర్వహణ, రోగులకు అందిస్తున్న ఆహారం, సిబ్బంది పనితీరును తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సిబ్బంది అందుకనుగుణంగా పనిచేయాలని సూచించారు.
విధుల్లో అలసత్వం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. వైద్యులు సకాలంలో విధులకు రావాలని చెప్పారు. దవాఖానలో 24 గంటలు మెడికోలు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రామచంద్ర పేర్కొన్నారు. వారి వెంట సర్జరీ విభాగాధిపతి డాక్టర్ అన్వేశ్, ఇంటరన్స్, నర్సింగ్ కళాశాల సిబ్బంది ఉన్నారు.