24-03-2025 12:30:25 AM
సిరిసిల్ల, మార్చి 23(విజయ క్రాంతి): మహిళాలు ఆర్థికంగా బలపడేందుకు.. స్వయం సమృద్ది సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాలలోని సభ్యులకు రుణాలు అందిస్తూ, ఆర్థికంగా నిలదోక్కుకునేందుకు మార్గం సుగమం చేసింది. పలువురు మహిళలు జిల్లాలో వివిధ యూనిట్లు స్థాపించి విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు.
రుణాలు ఇచ్చి.. చేయూత అందించి
రాష్ట్రంలోని కోటి మంది మహిళాలను కోటీశ్వరులగా తీర్చిదిద్దాలనే మహోన్నత లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి పథకాన్ని ప్రజా ప్రభుత్వం రూపొందించి, దాదాపు లక్ష కోట్ల రుణాలు అందేలా చర్యలు తీసుకుంటుంది. మహిళా సంఘాలతో పట్టణాలలో, జిల్లాలో ప్రజా సంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో లాంచనంగా మూడు ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు ప్రారంభించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం, ఇల్లంతకుంట, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రూ. 3 లక్షల బ్యాంక్ రుణం అందజేసి, ఆయా చోట్ల ఏర్పాటు చేసిన క్యాంటీన్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎంఎల్‌ఏ ఆది శ్రీనివాస్, మానకొండూర్, చొప్పదండి ఎంఎల్‌ఏలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించి, పథకానికి జిల్లాలో శ్రీకారం చుట్టారు.
విభిన్నమైన యూనిట్లు స్థాపించి
ఇందిరా మహిళాశక్తి కింద జిల్లాలోని ఆయా మండలాల్లో వివిధ యూనిట్లు ఏర్పాటు చేశారు. విభిన్నమైన వ్యాపార యూనిట్లు స్థాపించి దముందుకు సాగుతున్నారు. డెయిరీ యూనిట్, కోల్ ప్రెస్సింగ్ ఆయిల్ మిల్, మదర్ యూనిట్ (పెరటి కోళ్ల పెంపకం) కుట్టు మిషన్ కేంద్రం, బేకరీ, గిఫ్ట్ ఆర్టికల్స్, ఈవెంట్ మేనేజ్ మెంట్, మొబైల్ టిఫిన్ సెంటర్, చట్నీస్ అండ్ స్నాక్స్, మిల్లెట్స్ పౌడర్, రిటైల్ ఫిష్ ఔట్లెట్లు ఏర్పాటు చేసి, తమ వ్యాపారాలు చేస్తున్నారు.
ఒక్కొకరికి వారి వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని రూ. లక్ష నుంచి రూ. పది లక్షల వరకు రుణాలు ఇవ్వగా, దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుని కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.
వివిధ యూనిట్లకు రూ. 105 కోట్ల రుణాలు మంజూరు
వివిధ ఎంటర్ ప్రైజెస్ లు రూ. 100 కోట్ల 91 లక్షలతో మొత్తం 5,123 యూనిట్లు, పాడి గేదెల యూనిట్లు రూ. కోటి 57 లక్షలతో 185 యూనిట్లు, పెరటి కోళ్ల పెంపకం రూ. 93 లక్షలతో 621 యూనిట్లు, మదర్ యూనిట్స్ రూ.31 లక్షలతో 9 యూనిట్లు, మొబైల్ ఫిష్ ఔట్ లెట్ రూ. 10 లక్షలతో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రూ. 98 లక్షలతో 53 యూనిట్లు, మిల్క్ పార్లర్ రూ. 7.50 లక్షలతో మూడు యూనిట్లు, క్యాంటీన్ లు రూ. 8 లక్షలతో మూడు యూనిట్లు, రూ. 3 లక్షలతో ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేశారు.
కోడి పిల్లలు పెంచుతున్నాం
ఇందిరా మహిళా శక్తి కింద రూ. లక్ష రుణం తీసుకున్న. దానితో మా వ్యవసాయ పొలం వద్ద ఉన్న షెడ్ లో పెరటి కోడి పిల్లలు తీసుకు వచ్చి పెంచుతున్నాము. ఒక్కో పిల్లను 35 రూపాయలకు కొనుగోలు చేసి, 45 రోజులపాటు పెంచి దానిని రూ.100 కు విక్రయిస్తున్నాము. వ్యాక్సిన్లు, దాణా ఇతర ఖర్చులు మినహా మాకు దాదాపు రూ. 30వేలకుపైగా మిగులుతున్నాయి.
ఆలూరి ప్రేమల, మదర్ యూనిట్ నిర్వాహకురాలు, గోపాల్ రావుపల్లె సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు
నా పేరు టేకుమల్ల లక్ష్మి. మా మహిళా సంఘం పేరు శ్రీ సాయిరాం. నాకు మా సంఘం తరపున రూ. మూడు లక్షల రుణం ఇందిరా మహిళా శక్తి కింద అందింది. దీనితో మొబైల్ క్యాంటీన్ కొనుగోలు చేశాము. రద్దీ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేసి మా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాము. నిర్వహణ, ఇతర ఖర్చులు పోను మాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఆదాయం సమకూరుతుంది. మాకు రుణాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి, సహకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు కృతజ్ఞతలు.
టేకుమల్ల లక్ష్మి, మొబైల్ క్యాంటీన్ నిర్వాహకురాలు, తంగళ్ళపల్లి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి
ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అర్హులైన మహిళలందరూ ఒక ప్రణాళిక తో, మార్కెట్ డిమాండ్ ననుసరించి ఈ పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా బలపడాలి. కుటుంబానికి ఆర్ధిక భరోసా కల్పిస్తూ స్వయం సమృద్ది సాధించాలి.
సందీప్ కుమార్ ఝా, కలెక్టర్ రాజన్న సిరిసిల్ల