చాంపియన్స్ ట్రోఫీకి హాకీ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో కాంస్యంతో సత్తా చాటిన భారత హాకీ జట్టు మరో కీలక పోరుకు సమాయత్తమవుతోంది. సెప్టెంబర్‌లో చైనా వేదికగా ఆసియా చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం హాకీ ఇండియా హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని 18 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. ఇటీవలే గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ వీడ్కోలు పలకడంతో అతని స్థానంలో కిషన్ బహదూర్ పాఠక్‌ను ఎంపిక చేసింది. కిషన్‌కు ప్రత్యామ్నాయంగా సూరజ్ కర్కేరా ఉండనున్నాడు. ఒలింపిక్స్‌లో ఆడిన 10 మందిని ఈ టోర్నీకి ఎంపిక చేశారు.
రెగ్యులర్ వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్‌కు విశ్రాంతి నివ్వడంతో మిడ్ ఫీల్డర్ వివేక్ సాగర్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. హార్దిక్ సింగ్‌తో పాటు కీలక ప్లేయర్లు మన్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, షంషేర్ సింగ్, గుర్జంత్ సింగ్‌లకు కూడా టోర్నీ నుంచి విశ్రాంతి కల్పించింది. కాగా ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. వచ్చే నెల 8 నుంచి 17 వరకు జరగనున్న టోర్నీలో భారత్‌తో పాటు కొరియా, మలేషియా, పాకిస్థాన్, చైనా, జపాన్‌లు బరిలోకి దిగనున్నాయి. సెప్టెంబర్ 8న భారత్ తమ తొలి మ్యాచ్‌ను చైనాతో ఆడనుంది. ఆ తర్వాత వరుసగా జపాన్, మలేషియా, కొరియా, పాకిస్థాన్‌లతో ఆడనుంది.