calender_icon.png 5 April, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహానాయకుడు చూపిన మార్గం

05-04-2025 02:33:47 AM

భారతదేశ స్వరాజ్య ఉద్యమంతోపాటు తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణమూ మహానాయకుడు బాబు జగ్జీవన్‌రామ్ జీవితం ముడిపడి ఉంది. ఈ దృష్ట్యా ఆయన జీవితానికి రాజకీయ, సామాజిక, చారిత్రక ప్రాధాన్యం ఎంతో ఉంది. జగ్జీవన్‌రామ్ బీహార్‌కు చెందిన షాబాద్ జిల్లాలోని చంద్వా అనే మారుమూల గ్రామంలో 1908 ఏప్రిల్ 5న జన్మించారు. అస్పృశ్యత వంటి సామాజిక జాఢ్యాలను వ్యక్తిగతంగా ఎదుర్కొన్నారు. పాఠశాల నుంచి కళాశాల స్థాయివరకు మెరుగైన విద్యార్థిగా రాణించడంతోపాటు అసాధారణ మేధావిగానూ గుర్తింపు పొందారు. జగ్జీవన్‌రామ్ ఆరా పట్టణంలోని పాఠశాలలో చదువుతున్నప్పుడు కుండలో నీటిని తాగడానికి ఆధి పత్య కులాల విద్యార్థులు నిరాకరించారు.

-సంపతి రమేశ్ మహారాజ్

ఈ రకంగా ఆయన తొలిసారి 1922లో అంటరానితనం, అణచివేత వంటి వివక్షలకు గురయ్యారు. పాఠశాలలో కేవలం ఒకటే కుండలో నీళ్లు అందుబాటులో ఉండేవి. బాల్యదశలో ఇలాంటి చేదు అనుభవం ఎన్నో. దీంతో తాను ఎదుర్కొం టున్న వివక్షకు ఆయన ఆగ్రహంతో రగిలిపోయారు. చదువులో ఉత్తమంగా రాణిం చి తమను వ్యతిరేకించే వారందరికీ తగిన గుణపాఠం చెప్పాలనుకున్నారు. అనుకున్నట్టుగానే పట్టుదలతో చదివి, స్కూలులో అందరికన్నా గొప్ప ప్రతిభతో మెట్రిక్యులేషన్ చేశారు. తర్వాత కళాశాల విద్యను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అభ్యసించారు. 1931లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టభద్రుడ య్యారు. 

కలకత్తా వచ్చిన ఆరునెలల్లోనే విల్లింగ్టన్ స్క్వేర్‌లో జగ్జీవన్‌రామ్ 30,000 మంది కార్మికులను కూడగట్టి భారీ ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. దీంతో సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడిదారీ గ్రంథాలు సహా ఇతర సోషలిస్టు సాహిత్యాన్ని ఆయన అధ్యయనం చేశారు. అవి జగ్జీవన్‌రామ్‌పై ఎంతో ప్రభావాన్ని చూపా యి. బ్రిటిష్ వలసవాదాన్ని అంతం చేసి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడం, సమాజంలో సమానత్వాన్ని పెం పొందించడం వంటి లక్ష్యాలను విద్యార్థి దశలోనే ఆయన ఏర్పరచుకున్నారు.

కలకత్తా వేదికగా 1934లో జగ్జీవన్‌రామ్ ‘అఖిల భారత రవిదాస్ మహాస భ’ను స్థాపించారు. దళితుల సాంస్కృతిక కులగురువు అయిన ‘గురు రవిదాస్’ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అనేక జిల్లాల్లో రవిదాస్ సమ్మేళనాలను నిర్వహించారు. సాంఘిక సంస్కరణ కోసం వ్యవసాయ కార్మిక మహాసభను, ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ వంటి సంఘాలను నెలకొల్పారు. ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సాంఘిక సంస్కరణల సాధనకు రాజకీయ ప్రాతినిధ్యం వహించారు. దేశంలోని షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధి కోసం అప్పట్నించే అంకితమయ్యారు.

ఎమ్మెల్యే నుంచి ఉపప్రధాని వరకు!

మొట్టమొదటగా 1936లో బీహార్ శాసనసభకు ఎమ్మెల్యేగా గెలుపొందడం ద్వారా 28 ఏళ్ల వయసులో జగ్జీవన్‌రామ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఈ సమయంలోనే తమతో కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీనుంచి ఆయనకు ఆహ్వానం అందింది. దీంతో 1942లో అగ్రనేతల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అగ్రకుల పార్టీల కుట్రలను తెలుసుకోకుండా ఆయన తన శ్రమను ధార పోశారు. ఇక్కడే అంబేద్కర్‌కు జగ్జీవన్‌రామ్‌కు మధ్య వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమం కన్నా నా జాతి విముక్తే ముఖ్యమని అంబేద్కర్ భావిస్తే, జగ్జీవన్‌రామ్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని జగ్జీవన్‌రామ్ అరెస్టు అయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వ అణచివేతల్ని ఖండిస్తూ స్వాతంత్య్ర సాధనకోసం 1943 అక్టోబర్‌లో దేశ వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. భారతదేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా 1946 ఆగస్టు 30న బ్రిటిష్ వైస్రాయ్ 12 మంది దేశ నాయకులకు ఆహ్వానం పంపారు. వారిలో జగ్జీవన్‌రామ్ ఒకరు. 

1946 సెప్టెంబర్ 2న ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వంలో అణగారిన సామాజిక వర్గాలకు చెందిన ఏకైక ప్రతినిధిగా ఉండి కార్మికశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 33 ఏళ్లకు పైగా కేంద్ర క్యాబినెట్ మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా ఆయన సేవలందించారు. ఆ సమయంలో డాక్టర్ జగ్జీవన్‌రామ్ తీసుకున్న నిర్ణయాలు దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. ప్రధానం గా కేంద్ర వ్యవసాయ శాఖమంత్రిగా దేశంలోని ఆహార సమస్యల పరిష్కారం కోసం హరిత విప్లవానికి నాంది పలకడంలో కీలక పాత్ర పోషించారు. 1969లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను జగ్జీవన్‌రామ్ స్వీకరించారు. అయితే, ఇందిరాగాంధీ నియంతృత్వ విధానంతో విభేదించిన ఆయన 1977లో కాంగ్రెస్ పార్టీనుంచి బయటికొచ్చారు. అనంతరం ‘ప్రజాస్వామ్య కాంగ్రెస్’ (కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ) అనే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తన పార్టీని ఆయన జనతా పార్టీలో విలీనం చేశారు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు జగ్జీవన్‌రామ్ కేంద్ర రక్షణ శాఖామంత్రిగా విధులు నిర్వర్తించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన యుద్ధం సందర్భంగా ఆయన చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుని పోరాటంలో మన దేశం గెలిచేలా కృషి సలిపారు. 1979 జనవరి 24న డిప్యూటీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ప్రధాని పదవిని చేపట్టడానికి ఆయనకు అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ ఆయనకు ఆ పదవి అందిరాలేదు. 

అసమానతలు లేని సమాజం కోసం..

జగ్జీవన్‌రామ్ గొప్ప దార్శనికత, అనుభవం ఉన్న రచయిత. ఆయన హిందీ, ఇంగ్లీషులో పలు రచనలు చేశారు. ‘భారతదేశంలో కులం సవాళ్లు’, ‘జీవనసరళి వ్యక్తిత్వ వికాసం’ పేరున రెండు గ్రంథాలు రచించారు. గొప్ప సేవలకుగాను ఉజ్జయినిలోని విక్రమ విశ్వవిద్యాయం 1967లో జగ్జీవన్‌రామ్‌కి ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. మూఢనమ్మకాలు, సామాజిక వివక్ష, అసమాన తలు లేని స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య సోషలిస్టు సమాజ నిర్మాణం వంటివన్నీ జగ్జీవన్‌రామ్ దార్శనికతలో రూపుదిద్దుకున్నాయి. 1986 జూలై 6న జగ్జీవన్‌రామ్ భౌతికంగా మనల్ని వీడారు. యావత్తు భారతజాతి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. భారతదేశ చరిత్రలో ఆయనను మరో కోణంలో పరిశీలిస్తే అణగారిన వర్గం నుంచి ఉన్నత రాజకీయ పదవులు అధిరోహించిన బడుగు బలహీన వర్గాల నాయకుడిగా జగ్జీవన్‌రామ్ నిలిచారు.

అయితే, దళిత విముక్తి కోసం స్వశక్తితో అంబేద్కర్ వలే ఆయన పోరా టం చేయలేకపోయారు. అంబేద్కర్ ప్రజ ల విముక్తికి ప్రభుత్వం బయట నుంచి పోరాటం చేస్తే బాబు జగ్జీవన్‌రామ్ ప్రభుత్వంలో ఉండి పోరాడారు. ఇప్పుడు ఇలాం టి గొప్ప నాయకులు లేకపోవడం నిజంగా బాధాకరం. నేటికీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఓట్లకోసం దళితులను వర్గాలుగా విడగొడుతూ మోసం చేస్తున్నాయి. కొంద రు దళిత నేతలుకూడా వాళ్ల ఉచ్చులో చిక్కుకుని తమ జాతి ప్రయోజనాలను పక్కన పెడుతున్నారు. ఇప్పటికైనా దళిత నేతలు అగ్రకులాల పార్టీలనుంచి బయటకు వచ్చి రాజ్యాధికారం వైపు పయనిం చాలి. అప్పుడే జాతి ప్రయోజనాలను నిజంగా కాపాడిన వాళ్లు అవుతారు. లేదంటే, చరిత్రలో తప్పు చేసిన వాళ్లుగా మిగిలిపోతారు. ఆ మహానాయకుడి స్ఫూ ర్తితో అణగారిన వర్గాలకు చెందిన నేతలు స్వప్రయోజనాలను వీడి జాతి ప్రయోజనాల కోసం కృషి చేయాలి.

వ్యాసకర్త సెల్: 7989579428