calender_icon.png 26 October, 2024 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటేలు భార్య తీర్పు

26-10-2024 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

మహిళలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నేను పదో తరగతిలో ఉండగా జరిగిన ఒక చిక్కు పంచాయతీ విషయంలో మా ఊరి పటేలు భార్య ఇచ్చిన తీర్పు ప్రశంసనీయం. అప్పట్లో మా ఊళ్లో ప్రతి నెలా ఏకాదశికి ఎవరో ఒకరి ఇంట్లో ‘గీతా పారాయణం’ జరిగేది. నాకు చిన్నప్పట్నించీ ‘భగవద్గీత’ అంటే ప్రాణం. స్కూల్ సెలవు రోజుల్లో, ఎవరింట్లో ‘గీతా పారాయణం’ జరిగినా వెళ్లేవాణ్ణి. గీతా శ్లోకాలను గొంతెత్తి గానం చేసేవాణ్ణి.

ఆ రోజు సరాబు నారాయణ ఇంట్లో ‘గీతా పారాయణం’ జరుగుతుందంటే ఉదయమే వెళ్లాను. ఒక్కొక్క శ్లోకాన్ని భక్తితో మైమరచిపోయి గానం చేశాను. అప్పటికే ‘భాగవత పద్యాలు’ రాగయుక్తంగా చదివే అలవాటు వుండేది నాకు. అతని పేరు శేఖర్. నాకు క్లాస్‌మేట్. అందరం ఒక తీరుగా ఉండం కదా! గీతను బాగా చదువుతున్న నన్ను అందరూ మెచ్చుకుంటుంటే, శేఖర్ చూడలేక పోయాడు.

ఎక్కడో కూర్చున్న వాడు అకస్మాత్తుగా నా దగ్గరకి వచ్చి నా వీపుమీద గట్టిగా రెండు దెబ్బలు కొట్టి క్షణంలో మాయమయ్యాడు. అప్పుడు నాకు ఊపిరాడలేదు. “పోనియ్యి” అని నన్ను ఓదార్చిన వారేగాని, శేఖర్‌ను పట్టుకొని శిక్షిం చిన వాళ్లు ఎవరూ అక్కడ లేరు. 

పాలివాళ్లు, క్లాస్‌మేట్లు ఒకే రకం అనుకుంటాను. ఎదుటివారు బాగుంటే ఓర్వ రు. తాము బాగా ఉండలేరు. కలహం అనేది దూరంగా ఉన్నవాళ్ల మధ్య పుట్టదు. దగ్గర ఉన్నవాళ్ల మధ్యనే ఈర్ష్యాద్వేషాలు ఉంటాయని నాకప్పుడే తెలిసింది.

అందుకేనేమో, వేదం ‘అభయం మిత్రాత్, అభయ మమిత్రాత్’ అని చెబుతుంది.           “శత్రుభయం లేకుండా చేయగలవో దేవుడా!” అనకుండా, ముందుగా మిత్రులవల్ల భయం లేకుండా చేయమని భగ వంతుణ్ణి ప్రార్థించాలట. ఇందులోని అంతరార్థం నాకు తర్వాతి కాలంలోగాని బోధ పడలేదు.

శేఖర్ నన్ను కొట్టినప్పుడు, నేను ఎవరి సహాయాన్ని పొందలేకపోయాను. దుఃఖభారంతో, ఏడుస్తూ ఇంటికి వచ్చాను. “ఏం జరిగింది?” అని అమ్మ అడిగితే, చెప్పాను. అన్నయ్యలు ఇద్దరూ అప్పుడు ఇంట్లో లేరు. నాన్న కూడా బయటికి ఎక్కడికో వెళ్లారు. వారు ఇంటికి రాగానే మా అమ్మ తాను ఏడుస్తూ, నా గురించి చెప్పింది.

“పోతే పోనీ, ఆ దేవుడు ఆ పిల్లవానికి తగిన శాస్తి చేస్తాడు..” అని మా నాన్న ఓదార్చడానికి ప్రయత్నించాడు నన్ను. మా పెద్దన్న “వాని పాపాన వాడే పోతాడులే..” అని తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. ఇక, మిగిలింది చిన్నన్న. “నా తమ్ముడిని కొట్టిన వాడెంత గొప్పవాడైనా, నేనిప్పుడే అతనికి శాస్తి చేస్తాను..”

అని నిలబడిన వాడల్లా బయటికి వెళ్లడానికి ప్రయత్నించాడు. అందరినీ శాంత పరచవలసిన బాధ్యత నాన్నదే కదా! మా చిన్నన్న ఆవేశాన్ని చూసి, ఇదేదో పెద్ద గొడవగా మారుతుందని భావించి “నేను మన ఊరి పటేలుకు చెప్తాను..” అని మా చిన్నన్నను శాంత పరిచాడు.

మా ఊరి పెద్ద పటేలు కిచ్చారెడ్డి చాలా మంచివాడు. ఊళ్లో ఏ తగవులు ఏర్పడినా అతడే తీర్పు చెబుతాడు. గ్రామస్తుల శ్రేయస్సు కోరిన వాడు కనుక జాగ్రత్తగా ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాడు. మా నాన్న మాకెవరికీ తెలియకుండా ఊరి పటేలుతో జరిగిన విషయం చెప్పాడు. “ఆగండి. కాలం ఒక్కొక్కసారి దేనికైనా పరిష్కారం చెబుతుంది. మీ అబ్బాయిని కొట్టిన వాడు ధనవంతుల అబ్బాయి. డబ్బు అహంకారానికి కారణమవుతుంది. దీన్ని ఒక వారం తర్వాత పరిష్కరిద్దాం..” అని మా నాన్నని ఊరడించాడు పటేలు. 

‘దెబ్బకు దెబ్బ’ చెల్లు

అప్పటికి ఒక వారం కూడా గడవలేదు. ఒకరోజు శేఖర్ మా ఇంటిముందు నుంచి నడిచి వెళతున్నాడు. అప్పుడు నేను ఇంట్లోనే వున్నాను. మా చిన్నన్న మగ్గం నేస్తూ ఉన్నాడు. శేఖర్ నాకంట పడగానే. “అన్నా! శేఖర్..” అన్నానో లేదో మగ్గం మీంచి లేచి అతని వెంట పరిగెత్తాడు. శేఖర్‌ను వాళ్ల ఇంటిదగ్గర పట్టుకొని రెండు చెంపలూ వాయించాడు. శేఖర్ అనుకోని సంఘటనకు ఆశ్చర్యపడుతూ, కందిపోయిన తన చెంపల్ని రెండు చేతులతో అదిమి పట్టుకొని ఇంట్లోకి పరిగెత్తాడు.

ఇంటికి తిరిగి వచ్చిన మా చిన్నన్న “దెబ్బకు దెబ్బ. ఇంక ఈ సమస్యకు పరి ష్కారం అనేది లేదు” అన్నాడు. మా చిన్నన్న శేఖర్‌ను కొడుతాడని నేననుకోలేదు. అన్న ప్రేమ అంటే ఏమిటో నాకప్పుడు తెలిసింది. కాని, తర్వాత ఏం జరుగుతుందో అనే భయం పట్టుకుంది నన్ను. ఈ సమస్య ముగిసిందనుకున్న సమయంలో శేఖర్ వాళ్ల నాన్న, తన కుమారుణ్ణి కొట్టినందుకు ఊరి పటేలుకు ఫిర్యాదు చేశాడు.

“నా కుమారుడు తెలియక తమ్ముణ్ణి కొడితే, అతని అన్న నా కొడుకును కొడుతాడా?” అనేది ఆయన అభియోగం. ఊరి పటేలు అందరివాడు. ఎవరికీ బాధ కలగకుండా తీర్పు చెబుతాడు. అందుకే, ఊరి ప్రజలు కూడా ఆయనను చాలా గౌరవిస్తారు. శేఖర్ నాన్న పటేలుకు ఫిర్యాదు చేయడమేకాక “మా చిన్నన్నను పిలిచి చివాట్లు పెట్టాలని” కోరాడు.

“అయ్యా! పిల్లలు పిల్లలు ఏవో కారణాలవల్ల కొట్టుకుంటే పెద్దలు జోక్యం చేసుకోవడం భావ్యమా?” అన్నాడు పటేల్. “కుదరదు, ఇప్పుడే పిలిచి మా చిన్నన్నకు తగిన బుద్ధి చెప్పాలని” పటేల్ ఇంటిముందున్న అరుగు మీద కూర్చున్నాడు. దాంతో పటేలుకు ఏం చెయ్యాలో తోచలేదు. 

ఊరివాళ్లు వచ్చి ఎవరెవరు, ఏం చెబుతుంటారో పటేలు భార్య గమనిస్తూ ఉంటుంది. శేఖర్ నన్ను కొట్టాడని మా నాన్న ఫిర్యాదు చేస్తే, తన కుమారుణ్ణి కొట్టాడని శేఖర్ వాళ్ల నాన్న ఫిర్యాదు చేశాడు. ఇద్దరి ఫిర్యాదులను విన్న పటేలు భార్య మాట్లాడకుండా ఉండలేక పోయింది. తీర్పు చెప్పమని పట్టుబట్టిన శేఖర్ నాన్నతో

“శంకరయ్యగారూ! ఈ సమస్యను ఇంకా ఎందుకు పెద్దది చేస్తున్నారు? బుచ్చయ్యగారి కొడుకును మీ వాడు కొడతే, మీ వాడిని ఆ పిల్లవాని అన్న వచ్చి కొట్టాడు. దెబ్బకు దెబ్బ సరిపోయింది. ఇంకా తీర్పు చెప్పమని ఎందుకడుగుతారు?” అంది కొద్దిగా పరుషంగానే. 

పటేలు ఇంట్లోకి వెళ్లిన సమయంలో, పటేలు భార్య ఈ విధంగా మాట్లాడేసరికి శేఖర్ నాన్న ఏమీ చేయలేకపోయాడు. భుజం మీదినుంచి జారి పడుతున్న కండువాను సరిచేసుకుని అక్కడి నుంచి నిష్క్రమించాడు, పటేలుకు చెప్పకుండానే. 

శేఖర్, నేను 10 వరకు కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత నేను హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాను. 10 తర్వాత ఇంతవరకు నేనతణ్ణి చూడలేదు. కాని, ఎక్కడ గీతాపారాయణం జరిగినా శేఖర్ పంచాయతీ నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది.

 వ్యాసకర్త సెల్: 9885654381