ఎంఐఎంకు భయపడుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ చెప్పారు. పిడికెడు మంది ఉన్న దరిద్రపు పార్టీ ఎంఐఎం అని, ఆ పార్టీకి భయపడేది జాతీయ పార్టీ అవుతుందా అని ప్రశ్నించారు. ఎంఐఎంకు భయపడి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని విమర్శించారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ సెంట్రోల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని టీఎన్‌జీవోస్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను బుధవారం బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంపై పోరాటం చేసిన సమరయోధులు చేసిన త్యాగాలను ప్రజలకు గుర్తు చేయడమే ఈ ఫొటో ఎగ్జిబిషన్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ అధికారి శ్రీధర్ సూరునేని, నెహ్రూ యువకేంద్ర జిల్లా అధికారి వెంకటరాంబాబు, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం కరీంనగర్ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏఆర్‌వీఆర్ ల్యాబ్‌ను బండి సంజయ్ ప్రారంభించారు. జమ్మికుంటలోగల శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన హాస్టల్ బ్లాక్‌ను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుండడం శోచనీయమన్నారు.