calender_icon.png 23 February, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాస్‌వర్డ్స్ కావలెను!

23-02-2025 12:56:59 AM

రూ.1,400 కోట్ల జీఎస్టీ స్కామ్ 

  1. క్రెడెన్షియల్స్ కోసం వాణిజ్య పన్నుల విభాగంపై సీఐడీ ఒత్తిడి?
  2. సవాల్‌గా మారిన శాఖపరమైన వివరాల సేకరణ
  3. వివరాలు ఇస్తేనే విచారణ మరింత వేగవంతం!!
  4. ఈ కేసులో నిందితుడిగా మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాం తి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన రూ.1,400కోట్ల వాణిజ్య పన్నుల శాఖ స్కామ్ కేసును సీఐడీ లోతుగా విచారిస్తోంది. ఈ కేసు విచారణలో కమర్షియల్ ట్యాక్స్ విభాగం నుంచి శాఖాపరమైన వివరాలను సేకరించడం సీఐడీకి సవాల్ మారింది.

కేసులో నిందితులుగా ఉన్న అప్పటి విభాగం అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామ్‌ప్రసాద్ కు సంబంధించిన క్రెడెన్సియల్స్(లాగిన్ పాస్‌వర్డ్స్)ను ఇవ్వాలని వాణిజ్య పన్నుల శాఖ హెడ్డాఫీస్‌లోని ఉన్నతాధికారులను సీఐడీ సంప్రదించినట్లు తెలిసింది. తాము విచారించేందుకు నిందితులైన అధికారుల లాగిన్ పాస్‌వర్డ్స్ ఇవ్వాలని రెండు నెలల క్రితం సీఐడీ నుంచి వచ్చిన హెడ్‌కానిస్టేబుల్  కమర్షియల్ ట్యాక్స్ ఉన్నతాధికారిని సంప్రదించినట్లు తెలిసింది.

కానీ క్రెడెన్సియల్స్‌ను సీఐడీకి ఇప్పటివరకు ఇవ్వలేదని సమాచారం. శాఖపరమైన గోప్యతకు భంగం కలుగుతుందన్న ఉద్దేశంతోనే లాగిన్ పాస్‌వర్డ్స్ ఇచ్చేందుకు అధికారులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో రెండు నెలలుగా సీఐడీ నుంచి సమాచారం రావడం.. ఇక్కడ అధికారులు జాప్యంచేయడం పరిపాటిగా మారిందన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది.

ఇప్పటికే ప లు కోణాల్లో ఈ కేసును దర్యాప్తును ముమ్మరం చేసిన సీఐడీ.. ఈ కేసు లో కీలక నిందితులుగా ఉన్న కమర్షియల్ టాక్స్ అధికారులను కూడా పి న్ టు పిన్ విచారించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే క్రెడెన్సి యల్స్ కోసం ప్రయత్నిస్తున్నది.  

విచారణ ఆచితూచి.. 

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ నిందితుడిగా ఉన్న ఈ కేసు విచారణలో సీఐడీ ఆచితూచి వ్యవహరి స్తోంది. విచారణకు అవకాశం ఉన్న అన్నిదారులను అన్వేషిస్తోంది. ఇప్పటికే ఈ కేసు ప్రాథమిక దర్యాప్తును పూర్తిచేసిన సీఐడీ, తాజాగా ఫోరెన్స్ నివేదికను కూడా రెడీ చేసింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, కాశీ, శివరామ్‌ప్రసాద్, ప్రొఫెసర్ శోభన్ బా బు ఫోన్లను స్వాధీనం చేసుకొని, డే టాను విశ్లేషించి, ఫొరెన్సిక్ నివేదిక ను సిద్ధం చేసినట్లు సమాచారం.  సోమేశ్ కుమార్, కాశీ, శివరామ్ ప్ర సాద్, శోభన్ బాబు ఉన్న వాట్సాప్ గ్రుపులో మెసేజ్‌లను సాంకేతికతను ఉపయోగించి డేటాను సేకరించినట్లు తెలిసింది. అయితే ఈ నలు గురి మధ్య వాట్సాప్ కాల్స్ ద్వారా సంభాషణ జరిగినట్లు సమాచారం. 

25న ఉన్నతస్థాయి కమిటీ సమావేశం

ఇదిలా ఉండగా.. రూ.1,400 కో ట్ల జీఎస్టీ స్కామ్‌పై శాఖాపరంగా అంతర్గత విచారణ కోసం ప్రభుత్వం ఐఏఎస్ టీకే శ్రీదేవి ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటి అక్రమంగా ఐటీసీ పొందిన కంపెనీలకు నోటీసులు పంపుతోంది. మరోవైపు అవకతవకలకు పాల్పడిన 76 కంపెనీలపై ఆడిట్ చేస్తోంది. ఈ ఆడిట్‌లో భాగంగా ఇప్పటికే పలుమార్లు సమావేశమైన కమిటీ.. ఈ నెల 25న మరోసారి సమావేశం కాబోతుంది.

ఈజీగా తెలిసిపోతాయ్.. 

కమర్షియల్ టాక్స్ పోర్టల్‌లో నిందితులైన అధికారులు ఏం చేశారు? రోజూవారీ కార్యకలాపాలు ఏంటి? ఏమైనా ట్యాక్స్ పేమెంట్‌లో అవకతవకలకు పాల్పడ్డారా? ఇలా ప్రతి అంశాన్ని తెలుసుకోవాలంటే.. సదరు అధికారుల క్రెడెన్సియల్స్ తప్పనిసరి. వాణజ్య పన్నుల శాఖ పోర్టల్ ద్వారానే జీఎస్టీ లావాదేవీలు జరుగుతాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు పోర్టల్‌లో అన్ని రకాల అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో సదరు అధికారుల కార్యకలాపాలను కమర్షియల్ టాక్స్ పోర్టల్‌లో పరిశీలిస్తే.. వారు ఏమైనా అవకతవకలకు పాల్పడ్డారా? అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. దీని ద్వారా కేసు విచారణ వేగవంతం కావడమే కాకుండా, వాస్తవాలు బయటపడుతాయన్న ఆలోచనలో సీఐడీ ఉన్నట్లు సమాచారం.

కానీ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మాత్రం ఆ వివరాలను ఇచ్చేది లేదంటున్నారు. శాఖాపరమైన గోప్యత నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు క్రెడెన్సియల్స్ ఇవ్వకుంటే..  అవసరమైతే సీఐడీ కోర్టు నుంచి అనుమతులు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.