22-03-2025 01:04:07 AM
ఢిల్లీ నుంచి లక్నో వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఘటన
లక్నో: విమానం గాల్లో ఉండగానే ప్రయాణికుడు మృతి చెందడం కలకలం రేపింది. విషయంలోకి వెళితే ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి లక్నోకు బయల్దేరి వెళ్లింది. ఉదయం 8.10 గంటలకు లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే ప్రయాణికులు దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే విమానంలో ఒక ప్రయాణికుడు మాత్రం చలనం లేకుండా సీట్లో పడి ఉన్నాడు. దీంతో అనుమానమొచ్చిన సిబ్బంది అతడి దగ్గరికి వెళ్లి లేపడానికి ప్రయత్నించగా స్పందన రాలేదు. దీంతో వైద్యుడిని పిలిపించి ప్రయాణికుడిని పరీక్షించగా.. అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. మృతుడిని అసిఫుల్లా అన్సారీగా గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత అసిఫుల్లా మృతికి కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.